భారత్‌కు హాని చేయాలంటే భయపడేలా.. అమిత్ షా వార్నింగ్

by Phanindra |

భారత్‌కు హాని చేయాలంటే భయపడేలా ఢిల్లీ పేలుడు నిందితులను శిక్షిస్తామని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.

భారత్‌కు హాని చేయాలంటే భయపడేలా.. అమిత్ షా వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తామని,, మరోసారి భారత్‌పై ఇలాంటి దాడులు చేయకూడదనే సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చేలా ఈ శిక్ష ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌తో తాము ముందుకు సాగుతున్నామని, ఈ విధానాలకు అనుగుణంగానే ఉగ్రదాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ‘ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ భారత్ సహించదనే సందేశాన్ని ప్రపంచానికి పంపేలా నిందితులను శిక్షిస్తాం. మనదేశానికి హాని తలపెట్టిన ఎవరైనా సరే అత్యంత కఠినమైన పరిణామాలు ఎదుర్కొంటారనే సందేశం పంపుతాం’ అని షా చెప్పారు. గుజరాత్‌లో శ్రీ మోతీభాయ్ ఆర్. చౌదరీ సాగర్ సైనిక్ స్కూల్, సాగర్ ఆర్గానిక్ ప్లాంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్ఎస్ఏ దోవల్, ఐబీ చీఫ్‌తో భేటీ

జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర తపన్ కుమార్ డేకా, కేంద్ర హోం సెక్రెటరీ గోవింద్ మోహన్‌తో అమిత్ షా కీలక భేటి నిర్వహించారు. ఢిల్లీ పేలుడు వెనుక జైష్-ఎ-మహమ్మద్ టెర్రర్ మాడ్యూల్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైలెవెల్ సెక్యూరిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.

Next Story