కేతన్ హత్య కేసు.. సియా, చేతన్‌లకు 14 రోజులు రిమాండ్

by Naga Rani Yarlagadda |

రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకేసులో నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలకు పూణె కోర్టు రిమాండ్ విధించింది.

కేతన్ హత్య కేసు.. సియా, చేతన్‌లకు 14 రోజులు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకేసులో నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలకు పూణె కోర్టు రిమాండ్ విధించింది. ఇద్దరికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితుల పోలీస్ కస్టడీ ముగియడంతో.. దర్యాప్తు అధికారులు వారిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (JMFC)ఎ.ఎమ్.విభూతే ఎదుట హాజరు పరిచారు. నిందితుల్ని మరింత విచారించాల్సి ఉందని, మరో మూడురోజులు పోలీస్ కస్టడీ పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోర్టును అధికారులు కోరారు. అందుకు కోర్టు నిరాకరించి.. ఇద్దరికీ జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

కాగా.. సియా గోయల్, చేతన్ ల ఫోన్లను రికవరీ చేసి.. వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్ లో కోడ్ లాంగ్వేజీ, కొన్ని కోడ్ సింబల్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఆ విషయాలను కోర్టుకు వివరించారు. ఆ కోడ్ వర్డ్స్ వెనుక ఉన్న అర్థాలను, వాటికి హత్యతో ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు నిందితుల్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా.. నిందితుల తరపు న్యాయవాదులు ప్రాసిక్యూషన్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే విచారణకు తగినంత సమయం ఇచ్చారని, ఇకపై పోలీస్ కస్టడీ అవసరం లేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ప్రాసిక్యూషన్ అభ్యర్థనను తిరస్కరించింది. ఇద్దరికీ జులై 16 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story