పక్షవాతంతో మంచానపడ్డ మామను చంపిన ‘సైకో’ కోడలు..! అరెస్ట్

by Ramesh Naini |

జార్ఖండ్ రాజధాని రాంచీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పక్షవాతంతో మంచానపడ్డ వృద్ధుడైన మామను ఓ కోడలు దిండుతో ముఖంపై అదిమిపెట్టి కిరాతకంగా హత్య చేసింది.

పక్షవాతంతో మంచానపడ్డ మామను చంపిన ‘సైకో’ కోడలు..! అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్ రాజధాని రాంచీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పక్షవాతంతో మంచానపడ్డ వృద్ధుడైన మామను ఓ కోడలు దిండుతో ముఖంపై అదిమిపెట్టి కిరాతకంగా హత్య చేసింది. విద్యానగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, నిందితురాలిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ కేపీ గుప్తా స్థానికంగా ప్రముఖ హోమియోపతి వైద్యుడు. కొన్ని నెలల క్రితం పక్షవాతం బారిన పడిన ఆయన అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో కోడలు నికిత ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతుడి భార్య, తన కుమారుడు సౌరభ్‌కు భోజనం ఇవ్వడానికి అతని దుకాణానికి వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సీసీటీవీ లైవ్ ఫీడ్‌లో గమనించిన కుమారుడు

నిందితురాలు నికిత, మృతుడి కుమారుడు సౌరభ్‌కు 2025 నవంబర్‌లో వివాహమైంది. తండ్రి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు సౌరభ్ తన ఇంట్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. శనివారం దుకాణంలో ఉన్న సమయంలో మొబైల్ లైవ్ ఫీడ్ ద్వారా ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన అతను హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. అయితే, అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందని సౌరభ్ కన్నీరుమున్నీరయ్యాడు.

సాక్ష్యాల ధ్వంసానికి యత్నం!

హత్య అనంతరం సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు తన భార్య యత్నించిందని సౌరభ్ ఆరోపించాడు. హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలున్న దిండును డాబాపై దాచిపెట్టగా.. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేసేందుకు ఆమె ప్రయత్నించిందని పేర్కొన్నాడు. తన భార్యను ఓ ‘సైకో కిల్లర్’ అని అభివర్ణించిన సౌరభ్.. ఆమెకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశాడు.

అన్ని కోణాల్లో దర్యాప్తు: సిటీ ఎస్పీ

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)కు తరలించారు. రాంచీ సిటీ ఎస్పీ పరాస్ రానా మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ‘ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలో నిందితురాలు గదిలోకి వెళ్లడం, బయటకు రావడం మాత్రమే రికార్డయ్యింది. మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే, వృద్ధుడికి పక్షవాతంతో పాటు గతంలో గుండెపోటు వచ్చిన చరిత్ర కూడా ఉండటంతో, ఆ ఆరోగ్య సమస్యల ప్రభావం మరణంపై ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story