- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waqf Bill: వక్ఫ్ బిల్లు ఆమోదంపై కోల్‌కతా, చెన్నైలో భారీ నిరసనలు
భారీ సంఖ్యలో ముస్లిములు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మేము వక్ఫ్ సవరణను తిరస్కరిస్తున్నామంటూ నినాదాలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఆమోదం పొందడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లో శుక్రవారం ముస్లింలు ప్రార్థనల అనంతరం వేలాదిగా నిరసనలు తెలుపుతూ వీధులకెక్కారు. కోల్‌కతాలో జాయింట్ ఫోరమ్ ఫర్ వక్ఫ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ముస్లిములు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మేము వక్ఫ్ సవరణను తిరస్కరిస్తున్నామంటూ నినాదాలు చేశారు. వచ్చే ఏడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బెంగాల్‌లో ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలోని ముస్లింలు తమ భూములను కోల్పోవడాన్ని అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన నిరసనల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రోడ్డుపై ఆందోళనకు దిగిన నిరసనకారులను పోలీసులు బలవంతంగా పంపించేందుకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తైహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) రాష్ట్ర యూనిట్ చీఫ్‌తో పాటు 40 మంది ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోనూ ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. తమిళ నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపివ్వడంతో చెన్నై, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో నిరసనకారులు చేరి.. వక్ఫ్ బిల్లును తిరస్కరించండి, ముస్లింల హక్కులను కాపాడాలంటూ నినదించారు. లక్నోలో కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వక్ఫ్ బిల్లు గురించి పూర్తిస్థాయిలో తెలుసుకున్న తర్వాత అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని, సోషల్ మీడియాను విడిగా పర్యవేక్షిస్తున్నామని సెంట్రల్ లక్నో డిప్యూర్టీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆశిష్ శ్రీవాస్తవ వెల్లడించారు.






