- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Justice Varma impeachment: ఇంట్లో డబ్బు కట్టలు దొరికిన జడ్జి తప్పు చేసినట్లు నిర్ధారించిన సుప్రీంకోర్టు ప్యానెల్
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు దొరికిన మాట నిజమేనని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ధృవీకరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది మార్చిలో 'కాలిన రూ. 500 నోట్ల కుప్ప' దొరికిన ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని ముగ్గురు సభ్యుల సీనియర్ న్యాయమూర్తుల ప్యానెల్ సిఫార్సు చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ 55 మంది సాక్షులను ఇంటర్వ్యూ చేసి జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని నమోదు చేశాయి. 64 పేజీల నివేదికను మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సమర్పించింది. తాజాగా దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు దొరికిన మాట నిజమేనని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ధృవీకరించింది. భారీ మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలను ప్రత్యక్ష సాక్షులు చూసినప్పటికీ జస్టిస్ యశ్వంత్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్యానెల్ తేల్చింది. పైగా జ్యుడీషియల్ అధికారులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ వ్యవహారంలో యశ్వంత్ వర్మ ప్రవర్తన అసహజంగా ఉందని, ఆయన్ను తొలగించడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయని సిఫారసు చేసినట్టు సమాచారం.
వీడియోలు, ఫొటోల పరిశీలన
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వాంగ్మూలాన్ని పరిశీలించిన ప్యానెల్, స్టోరూమ్‌లో కాలిన నోట్ల కట్టల వీడియోలు, ఫొటోలను కూడా పరిశీలించింది. కాలిన డబ్బు ఉన్న స్టోరూమ్ నిర్వహణ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జస్టిస్ యశ్వంత్ వర్మ్ లేదా ఆయన కుటుంబసభ్యుల చేతుల్లోనే ఉందని ప్యానెల్ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, అగ్నిప్రమాదంలో కాలిన నోట్లను మార్చి 15న అక్కడి నుంచి తొలగించడమే దానికి నిదర్శనమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్ర అని జస్టిస్ యశ్వంత్ వర్మ్ వాదనను ప్యానెల్ తిరస్కరించింది. కుట్ర అనే అనుమానాలు ఉన్నప్పుడు ఎందుకని ఫిర్యాదు చేయలేదని, హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా సమాచారం ఎందుకివ్వలేదని కమిటీ ప్రశ్నించింది.
షాక్ తిన్న ప్రత్యక్ష సాక్షి
లభించిన ప్రత్యక్ష ఆధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బట్టి ఆరోపణలు నిజమేనని కమిటీ తెలిపింది. దర్యాప్తులో భాగంగా విచారించిన సాక్షుల్లో ఒకరు.. తాను ఆ గదిలోకి వెళ్లిన సమయంలో నేలపైన రూ. 500 నోట్ల కట్టలు కుప్పలుకుప్పలుగా పడున్నాయి. వాటిని చూసి షాక్ తిన్నాను. తన జీవితంలో ఇంత భారీ డబ్బు చూడలేదని చెప్పారు. ఇదే సమయంలో నోట్ల కట్టల ద్వగ్ధం ఘటనకు సంబంధించి ఆధారాలను తొలగించడంలో జస్టిస్ యశ్వంత్ వర్మ కుమార్తెతో పాటు ప్రైవేట్ సెక్రటరీల పాత్ర ఉండొచ్చని కమిటీ సందేహం వ్యక్తం చేసింది. వారిని కూడా విచారించిన కమిటీ, అగ్నిమాపక సిబ్బంది నోట్ల వివరాలు రిజిస్టర్ చేయకుండా ఉండేందుకు సెక్రటరీ రాజేంద్ర సింగ్ అడ్డుకున్నట్టు తేలింది.
కాగా, ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధుల్లో ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో 2025, మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో స్టోర్ రూమ్‌లో భారీగా కాలిన కరెన్సీ నోట్లు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు పెరగడంతో మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అగ్ని ప్రమాదంపై విచారణ నిమిత్తం ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.






