Parliament: సమావేశాలు 100% సక్సెస్

by Mahesh Kanagandla |

ఈ నెల 1వ తేదీన మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు ఫలవంతంగా జరిగాయి.

Parliament: సమావేశాలు 100% సక్సెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 1వ తేదీన మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు ఫలవంతంగా జరిగాయి. నిర్ణయించినదానికన్నా ఎక్కువ డిబేట్ జరిగింది. కీలకమైన బిల్లులకు ఆమోదం లభించింది. కీలకమైన వందేమాతరం, ఎన్నికల సంస్కరణలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అదే విధంగా వీబీ జీరామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు భీకరంగా ఆందోళనలు చేపట్టాయి. ఒకవైపు డిబేట్లు, మరోవైపు ఆందోళనలతో సమావేశాలు ఎట్టకేలకు 15 రోజుల భేటీ అనంతరం ముగిశాయి.

100 శాతానికి మించి ప్రొడక్టివిటీ

ఈ సారి సమావేశాలు 15 రోజులు జరిగాయని, సమావేశాలు ఫలవంతమయ్యాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. మొత్తంగా 92 గంటలపాటు సమావేశాలు జరిగాయన్నారు. లోక్‌సభలో 111 శాతం, రాజ్యసభలో 121 శాతం ప్రొడక్టివిటీ నమోదైనట్టు తెలిపారు. ఈ సమావేశాలు ఫలవంతం కావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. ప్రతిపక్షాల ఆందోళనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీబీ జీరామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు హంగామా ఆక్షేపణీయమని, ప్రతులు చించేయడం, డెస్క్‌లు ఎక్కి అరవడం, వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడం.. చట్టసభ్యుడి ప్రవర్తనగా తాము అంగీకరించలేమని వివరించారు. రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ కూడా ప్రతిపక్షాల తీరును ఆక్షేపించారు.

బిజీ.. బిజీగా షెడ్యూల్

లోక్‌సభలో ఎనిమిది బిల్లులు, పది ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. మణిపూర్ జీఎస్టీ రెండో సవరణ బిల్లు, కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లు, హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు, అప్రోప్రియేషన్ బిల్లు, రిపీలింగ్ అమెండింగ్ బిల్లు, సబ్కా బీమా సబ్కా రక్షా సవరణ బిల్లు, శాంతి బిల్లు, వీబీ జీరామ్ జీ బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి. ఉభయ సభల్లో జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రసవత్తరంగా చర్చ జరిగింది. ఈ గేయంలోని పాదాలను నెహ్రూ తొలగించారని, ముస్లింలను సంతుష్టపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని, జిన్నా ఒత్తిడికి లొంగారని ప్రధాని మోడీ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. కాగా, అది నెహ్రూ ఒక్కడి నిర్ణయం కాదని, అందులో ఠాగూర్, సుభాష్ చంద్రబోస్‌ల అంగీకారమూ ఉన్నదని, నెహ్రూ వ్యాఖ్యలను విడిదీసి ఎందుకు చెబుతున్నారని, మిగిలిన వివరాలు ఎందుకు దాస్తున్నారని ప్రియాంక గాంధీ ఎదురు ప్రశ్నించారు. అనంతరం, ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా ప్రతిపక్షాలు ఎస్ఐఆర్‌పై తీవ్ర అనుమానాలు లేవనెత్తారు. రాహుల్ గాంధీ ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్ నుంచి సీజేఐను తొలగించడం, పోలింగ్ బూత్‌ల ఫుటేజీ తొలగించడం, దర్యాప్తు నుంచి వీరికి రక్షణ కల్పించే నిబంధనలను ఆయన లేవనెత్తగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అందుకు సమాధానాలిచ్చారు.

మూడు కీలక బిల్లులు

ఈ సమావేశాల్లో కీలకమైన సస్టెయినబుల్ హార్నెసింగ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా బిల్లు(శాంతి బిల్లు) ఉన్నది. ఈ బిల్లు ద్వారా భారత న్యూక్లియర్ పవర్ సెక్టార్‌లో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి కేంద్రం అనుమతిచ్చింది. ఇన్నాళ్లు ఈ రంగం చాలా రిస్ట్రిక్టెడ్, ప్రభుత్వానికి మాత్రమే పరిమితమైన రంగం. అలాగే.. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. అంటే.. విదేశీ కంపెనీ నేరుగా ఇక్కడ స్వతంత్రంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేసుకోవచ్చు. దేశీయ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుని తీరాల్సిన అవసరం లేదు. అయితే, ఆ కంపెనీలు కూడా భారత చట్టాలకు లోబడి నడుచుకోవాలి. అలాగే.. 2005లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం తెచ్చిన కొత్త జీ రామ్ జీ చట్టం. ఈ బిల్లులో పని దినాలను 100 నుంచి 125కు పెంచింది. నిధుల భారాన్ని దాదాపు సగం రాష్ట్రాలపై వేసింది. చాలా వరకు నిర్ణయాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంది.

టీ పార్టీకి ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో ప్రియాంక

సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆనవాయితీగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందునిచ్చారు. ఈ టీ పార్టీకి అధికార, విపక్ష నేతలు హాజరయ్యారు. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. చివరిసారి టీపార్టీని విపక్షాలు బాయ్‌కాట్ చేశాయి. రాహుల్ గాంధీ తరుచూ ఈ తేనీటి విందుకు గైర్హాజరవుతుంటారు. ఈసారి మాత్రం విపక్ష నేతలు కూడా హాజరయ్యారు. సుమారు 20 నిమిషాలు జరిగిన ఈ టీపార్టీలో.. నేతలంతా సరదా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. తన నియోజకర్గం వయనాడ్‌లో ఉన్న ఒక సమస్య గురించి ప్రియాంక చెప్పగా.. అందరూ నవ్వుకున్నారని తెలుస్తోంది. అలాగే ప్రధాని తాజా విదేశీ పర్యటన గురించి కూడా ఆమె అడగ్గా.. టూర్ చాలా చక్కగా జరిగిందని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ప్రయోజనకరంగానే జరిగాయని, కానీ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని సభికులు చెప్పారు. దీనిపై సరదాగా స్పందించిన ప్రధాని.. తక్కువ రోజులు ఉండటం వల్ల ఎంపీలకు ఎక్కువ రోజులు అరిచే బాధ ఉండదని, వారి గొంతులకు శ్రమ తగ్గుతుందని జోక్ చేశారు. అలాగే పాత పార్లమెంటు భవనంలో ఉన్నట్లే కొత్త భవనంలో కూడా సెంట్రల్ హాల్ ఉంటే బాగుండేదని, అది లేకపోవడంతో ఎంపీలు మాట్లాడుకోవాలంటే క్యాంటీన్ ఒక్కటే వేదికగా మారుతోందని ఎంపీలు అభిప్రాయపడ్డారు. అయితే పాత పార్లమెంటులో కూడా సెంట్రల్ హాల్‌ను పెద్దగా ఎవరూ ఉపయోగించుకోలేదని ఒక సీనియర్ ఎంపీ చెప్పారు. ఈ క్రమంలోనే జీరో హవర్‌లో మాట్లాడేందుకు తక్కువ అవకాశాలు వచ్చాయని కొందరు సభ్యులు చెప్పగా.. తాను అందరికీ అవకాశం ఇచ్చానని ఓం బిర్లా అన్నారు. అయితే తాము ఆయన్ను తప్పు బట్టడం లేదని, ఇది పేర్లు కేటాయించే ‘కంప్యూటర్ బాబా’పై కంప్లయింట్ అని సభ్యులు సరదాగా అనడంతో అందరూ నవ్వుకున్నారు. ఇదే సమయంలో ఎన్‌కే ప్రేమచంద్రన్ వంటి విపక్ష నేతలు.. సభకు వచ్చే ముందు పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తారని ప్రధాని మెచ్చుకున్నారు.

Next Story