- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka: ప్రియాంక గాంధీకి బాధ్యతల వెనుక బిగ్ స్కెచ్!
రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ అనే చర్చ జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాజకీయాల్లో ప్రియాంక గాంధీ పరిచయం అక్కర్లేని పేరు. నెహ్రూ ముని మనవరాలు, ఇందిరాగాంధీ మనవరాలు, రాజీవ్ గాంధీ కుమార్తె, రాహుల్ చెల్లెలుగా ఆమెకు ఎన్నో రకాల గుర్తింపులు ఉన్నా ఇటీవల ఆమె అవలంభిస్తున్న రాజకీయ వైఖరి ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాశంగా నిలుస్తున్నది. గత నెలలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అధికారపక్షం విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టిన తీరుతో ప్రియాంక గాంధీ పేరు పొలిటికల్ కారిడార్‍లో మరోసారి మార్మోగింది. లోక్ సభలోకి అడుగుపెట్టింది మొదటి దఫానే అయినా మోడీ, అమిత్ షా ధ్వయంపై ప్రియాంక గాంధీ తిరగబడిన తీరు అందరిని ఆకట్టుకుంది. దీంతో ప్రియాంక గాంధీ పీఎం ఫేస్ అనే చర్చ కూడా సొంత పార్టీలో హాట్ డిస్కషన్ గా మారింది. ఇటువంటి తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించడం నేషనల్ పాలిటిక్స్ లో ఆసక్తికర పరిణామంగా మారింది.
అస్సాం బాధ్యతల వెనుక కీలక వ్యూహం:
ఈ ఏడాది అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ. తమిళనాడు పుద్దుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈ రాష్ట్రాలకు తాజాగా స్క్రీనింగ్ కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. అయితే అస్సాం స్టేట్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీకి అప్పగించింది. ఈ మేరకు నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. అయితే ప్రియాంక గాంధీకి అస్సాం బాధ్యతలు అప్పగించడం వెనుక బిగ్ ప్లాన్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అస్సాంలో మొత్తం 126 స్థానాలు ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోత్ కూటమి 50 సీట్లు గెలుచుకుంది. ఓట్ల శాతం పరంగా చూస్తే ఎన్డీయే 43.9 శాతం, మహాజోత్‍కు 42.3 శాతం వచ్చాయి. ఇరు కూటముల మధ్య ఓట్ల తేడా కేవలం 1.6 శాతం మాత్రమే. దీంతో అస్సాంలో ప్రాంతీయ పార్టీలతో కలిపి బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేయగలిగితే హిమంత బిశ్వా ప్రభుత్వానికి అడ్డుకోవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. ఇందుకోసం పార్టీల మధ్య పొత్తులు, అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకం అని హస్తం పార్టీ భావిస్తోంది. అందువల్ల ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రియాంక ఫ్యూచర్‍కు టర్నింగ్ పాయింట్!:
అస్సాం స్క్రీనింగ్ కమిటీలో ప్రియాంక గాంధీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మసూద్ ఇటీవల మాట్లాడుతూ భవిష్యత్ లో ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి పదవికి పోటిపడితే అందుకు తాను మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. ప్రియాంక గాంధీకి ఇందిరా గాంధీ లాంటి తెగువ ఉందని ఒకవేళ ప్రియాంకను ప్రధానమంత్రిని చేస్తే ఇందిరా గాంధీలాగే బంగ్లాదేశ్‍కు గట్టి బదులు ఇస్తారని మసూద్ వ్యాఖ్యానించారు. అదే మసూద్ ను ఇప్పుడు ప్రియాంక టీమ్‍లో ఉంచడం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలనే అభిప్రాయాలు సైతం పార్టీలో వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏ ఎన్నికలోనైనా పార్టీ గెలుపు ఓటములను ప్రభావితం చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో తనకు లభించిన అవకాశాన్ని ప్రియాంక గాంధీ ఎలా వినియోగించుకోబోతున్నారు? ఆమె ఈ ఎన్నికల్లో అప్పర్ హ్యాండ్ సాధిస్తారా? తద్వారా పార్టీలోనూ మరింత కీలకంగా మారబోతున్నారా అనేది సస్పెన్స్ గా మారింది.






