డీలిమిటేషన్ వెనుక పెద్ద కుట్ర: లోక్‌సభలో ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పార్లమెంట్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

డీలిమిటేషన్ వెనుక పెద్ద కుట్ర: లోక్‌సభలో ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. మహిళా రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకించడం లేదని, కానీ ఈ బిల్లు వెనుక ఉన్న డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ప్రియాంకా గాంధీ పునరుద్ఘాటించారు. "మా నేత రాహుల్ గాంధీ స్వయంగా ప్రధాని దగ్గరకు వెళ్లి ఈ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడం లేదు, కానీ అందులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నాం" అని ఆమె పేర్కొన్నారు. మహిళల హక్కుల విషయంలో తామే ఛాంపియన్‌లమని బీజేపీ ప్రగల్భాలు పలుకుతోందని ఆమె ఎద్దేవా చేశారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో సరైన న్యాయం జరగాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. "దేశంలో కులగణన చేయడానికి ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు?" అని ఆమె ప్రశ్నించారు. ఓబీసీలకు న్యాయం జరగాలంటే కులగణన అత్యవసరమని, వారి హక్కులను కేంద్రం హరిస్తోందని ఆరోపించారు.

డీలిమిటేషన్ వెనుక పెద్ద కుట్ర...

ప్రస్తుతం సమస్య మహిళా బిల్లుతో కాదు, దానిని అమలు చేసేందుకు కేంద్రం పెట్టిన డీలిమిటేషన్ నిబంధనతోనే ఉందని ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. "డీలిమిటేషన్ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదిస్తే అది ప్రజాస్వామ్యానికే అంతం. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది" అని ఆమె హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేవలం రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కేంద్రం ఈ డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై ఒత్తిడి తీసుకువస్తోందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

Next Story