Congress: రాహుల్ స్థానంలో ప్రియాంక.. బాంబు పేల్చిన సోనియా అల్లుడు.. కాంగ్రెస్‍లో అసలేం ఏం జరుగుతోంది?

by Prasad Jukanti |

ప్రియాంక గాంధీని పీఎం ఫేస్ గా ఉంచాలనే డిమాండ్లు ఎక్కడికి వెళ్లిన వస్తున్నాయని ప్రియాంక గాంధీ భర్త చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Congress: రాహుల్ స్థానంలో ప్రియాంక.. బాంబు పేల్చిన సోనియా అల్లుడు..  కాంగ్రెస్‍లో అసలేం ఏం జరుగుతోంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. వచ్చే ఏడాదిలో పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. 2026 లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అస్సాం మినహా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఎన్డీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలని ఇప్పటి నుంచే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీకి ఏమాత్రం చాన్స్ ఇవ్వొద్దని ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‍లో (Congress Party) ఓ చర్చ హాట్ టాపిక్‍గా మారుతోంది. అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రభుత్వంలో కూర్చోబెట్టబోయేది రాహుల్ గాంధీ మాత్రమేనని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్న వేళ ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ లో క్రమంగా మద్దతు పెరుగుతుండటం చర్చనీయాశంగా మారింది.

అన్న స్థానంలో చెల్లి?:

నిజానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ నినాదాలతో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది విముఖత వ్యక్తం చేస్తున్నారనే చర్చ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో కొందరు నేతలు ఆ పార్టీకి దూరం కూడా అవుతున్నారు. అయినా రాహుల్ గాంధీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి బదులు ఆయన సోదరి ప్రియాంక గాంధీకి ఆదరణ పెరుగుతుంటడం చర్చగా మారింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ రాజకీయ ముఖచిత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండగా ఆయన గైర్హాజరీపై అధికార పక్షం చేస్తున్న దాడిని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సమర్ధవంతంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ కు సారధ్యం వహిస్తూ అధికార పక్షంపై విరుచుకుపడిన తీరు చర్చనీయాశంగా మారింది. ముఖ్యంగా వందేమాతరం, నరేగా చట్టం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ బిల్లు పై చర్చ సందర్భంగా గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ప్రియాంక ఇచ్చిన కౌంటర్ అందరినీ ఆకట్టుకుంది. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ప్రధానితో మీటింగ్ కు అటెండ్ కావడంతో అందరి దృష్టిలోప్రియాంక మరోసారి పడ్డట్లైంది. దీంతో పార్టీలో రాహుల్ స్థానాన్ని ప్రియాంక భర్తీ చేస్తారనే టాక్ జోరుగా వినిపించడం మొదలైంది.

ప్రియాంక పీఎం ఫేస్:

రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని తప్పకుండా ప్రధాన మంత్రిని చేస్తామని కాంగ్రెస్ శ్రేణలు బలంగా చెబుతున్న వేళ సొంత పార్టీలో ప్రియాంక విషయంలో వస్తున్న డిమాండ్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మెుఖ్యుం ప్రియాంకను ఏఐసీసీ ప్రెసిడెంట్ గా చేయాలని ఏకంగా సోనియాగాంధీకి ఇటీవల లేఖ రాశారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ పేరును ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. ప్రియాంకను ప్రధాన మంత్రిని చేస్తే ఆమె తన నాన్నమ్మ ఇందిరా గాంధీలా ప్రత్యర్థులకు బలమైన ప్రతిస్పందన ఇస్తారని చెప్పుకొచ్చారు.

ప్రతి చోటా డిమాండ్లు వస్తున్నాయి:రాబర్డ్

ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రియాంక భర్త రాబర్డ్ వాద్రా (Robert Vadra) చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ప్రియాంక గాంధీ ముందుకు రావాలని అన్ని చోట్ల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయని నేను కూడా రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. కానీ ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందుతున్న నిజమైన సమస్యలపై మనం దృష్టి పెట్టాలన్నారు. రాహుల్ వర్సెస్ ప్రియాంక గాంధీ విషయంలో పార్టీనేతల్లో చర్చ జరుగుతున్న వేళ రాబర్డ్ వాద్రా చేసిన ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతం అనే అభిప్రాయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే కాంగ్రెస్ లో బిగ్ చేంజ్ రాబోతోందా? రాహుల్ ను కాదని ప్రియాంకను ముందుకు తీసుకువస్తే ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు అంగీకరిస్తాయా అనేది తెలియాల్సి ఉంది.

Next Story