- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసు.. వివరణ ఇవ్వాలని పార్లమెంట్ కమిటీ ఆదేశం
పార్లమెంటు ప్రాంగణంలోకి పెంపుడు కుక్కను తీసుకురావడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అదేవిధంగా తోటి ఎంపీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) మరోసారి వార్తల్లో నిలిచారు. పార్లమెంటు నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు తోటి ఎంపీలను అవమానించారనే ఆరోపణలపై ఆమెకు సభా హక్కుల ఉల్లంఘన (Privilege Notice) నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఫిబ్రవరి 23లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ ఆమెను ఆదేశించింది.
అసలు ఏం జరిగిందంటే..
కాగా, గత శీతాకాల సమావేశాల సందర్భంగా రేణుకా చౌదరి తన కారులో పెంపుడు కుక్కను పార్లమెంటు (Parliament) ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. అత్యంత భద్రత ఉండే పార్లమెంటు భవనంలోకి జంతువులను తీసుకురావడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని అప్పట్లో చర్చ మొదలైంది. దీనిపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘లోపల కూర్చున్న వారే కరుస్తారు, కుక్కలు కరవవు’ అంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజాప్రతినిధులను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ ఎంపీలు బ్రిజ్లాల్ (Brijlal), ఇందు బాలగోస్వామి (Indu Balagoswami) రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేయగా ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసులలో అనుమతి లేకుండా జంతువులను పార్లమెంటు ఆవరణలోకి తీసుకురావడం, సభ్యులను జంతువులతో పోల్చుతూ, వారి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం వంటి అంశాలు ఉన్నాయి.
రేణుకా చౌదరి కార్యాలయం కీలక ప్రకటన
తాజాగా జారీ అయిన సభా హక్కుల నోటీసులపై రేణుకా చౌదరి కార్యాలయం స్పందించింది. పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాలకు కట్టుబడి నిర్ణీత గడువులోగా వివరణ ఇస్తామని తెలిపింది. గతంలో ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. దారిలో గాయపడిన కుక్కను కాపాడి కారులో ఉంచానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రివిలేజ్ కమిటీ ఆమె ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.






