- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలం ముగిసినా జైళ్లలోనే ఖైదీలు.. నల్సార్ రిపోర్టులో సంచలన విషయాలు
Over 70% of India’s prisoners have not yet been found guilty

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని జైళ్లలో మగ్గుతున్న 70 శాతం మంది నిందితులు నేరం చేసినట్లు రుజువు కాలేదని సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2019-2024 మధ్య నల్సార్ యూనివర్సిటీకి చెందిన స్క్వేర్ సర్కిల్ క్లినిక్(ఎస్ఎస్‌సీ) విభాగం చేసిన సేవ, ఈ క్రమంలో కనుగొన్న కొన్ని విషయాలతో ఒక రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం స్క్వేర్ సర్కిల్ క్లినిక్ ఈ కాలంలో 5,783 కేసులు డీల్ చేసిందని, వీటిలో 41.3శాతం కేసుల్లో నిందితులకు ఉచిత లాయర్ సదుపాయం కల్పించలేదని తేలింది. అలాగే 77శాతం మందిని కేసు నమోదవగానే కుటుంబాలు పట్టించుకోవడం మానేశాయని వెల్లడించింది. 72 శాతం కేసుల్లో నిందితులు కనీసం స్కూలు విద్య పూర్తిచేయలేదని, 51శాతం మంది వద్ద కేసు ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేవని ఎస్ఎస్‌సీ తెలిపింది.
నేరం రుజువు కాకపోతే పరిమిత కాలానికి మించి వీరిని జైళ్లలో ఉంచకూడదని, కానీ ఆ కాలం ముగిసినా కూడా ఈ నిందితులు జైళ్లలోనే మగ్గుతున్నారని సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో అండర్‌ట్రయల్స్‌కు న్యాయ సహకారం అందించే విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని జస్టిస్ విక్రమ్ నాథ్ అభిప్రాయపడ్డారు. ‘చాలా కేసుల్లో నిందితులకు ఉచితంగా లాయర్‌ను ఏర్పాటు చేస్తారని కూడా తెలియదు. 74 శాతం అండర్‌ట్రయల్స్‌లో కేవలం 7.91 శాతం మంది మాత్రమే ఈ సేవను ఉపయోగించుకున్నారు. ఒకవేళ ఉచిత లాయర్ సౌకర్యం గురించి తెలిసినా.. గత అనుభవాల వల్ల సదరు లాయర్లపై నిందితులకు నమ్మకం కలగడం లేదు’ అని జస్టిస్ నాథ్ తెలిపారు. చాలా బెయిల్ అప్లికేషన్లను కూడా లాయర్లు మెకానికల్‌గా దాఖలు చేస్తున్నారని, నిందితులు అందించగలిగే ష్యూరిటీ, ఇతర డాక్యుమెంట్లను కూడా పిటిషన్‌కు జతచేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలేజీల నుంచే ఫెయిర్ ట్రయల్ ప్రోగ్రాం(ఎఫ్‌టీపీ) నేర్పించే విధానంలో మార్పులు చేయాలని, న్యాయానికి ప్రాణం పోసే విధానంగా దీన్ని నేర్పించాలని జస్టిస్ విక్రమ్ నాథ్ సూచించారు.






