నాలుగు రోజుల పాటు జపాన్, చైనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. వివరాలివే!

by Yella Dhawani Reddy |

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

నాలుగు రోజుల పాటు జపాన్, చైనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. వివరాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు అధికారికంగా జపాన్ (Japan), చైనా (China) దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగనుంది. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. మోడీ తన పర్యటనలో ముందుగా జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు 29, 30 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, ప్రధాని జపాన్ వెళ్లటం ఇది 8వ సారి, అలాగే ఆ దేశ ప్రధాని ఇషిబాతో మొదటి శిఖరాగ్ర సమావేశం కానుంది. ఇక ఈ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించుకోనున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచనుంది.

అనంతరం జపాన్ నుంచి మోడీ చైనా వెళ్లనున్నారు. అక్కడ ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో పర్యటిస్తారు. అయితే, మోడీ 7 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 2018వ సంవత్సరం ప్రారంభంలో కింగ్‌డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి వెళ్లిన మోడీ.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ దేశానికి వెళ్తున్నారు. ప్రస్తుతం భారత్-చైనా రెండూ పరస్పరం సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పర్యటన జరుగుతుండటం విశేషం. ఇక ఈ పర్యటనలో భాగంగా మోడీ తియాన్‌జిన్‌లో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తదితరులు హాజరుకానున్నారు.

Next Story