విదేశీ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న ప్రధాని మోడీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-10 05:51:17  IST  )

విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ తిరిగి భారత్ చేరుకున్నారు.

విదేశీ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) విదేవీ పర్యటన ముగించుకుని తిరిగి భారత్‌ చేరుకున్నారు. ఆయన 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించారు. ఇందులో ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటినా, బ్రెజిల్, నమిబియా దేశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రెజిల్‌లో జరిగిన 17వ BRICS శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, ఈ పర్యటన సమయంలో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సంబంధాల బలపరిచే దిశగా, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించేందుకు, గ్లోబల్ సౌత్‌లో భారతదేశ ప్రభావాన్ని పెంచేందుకు దృష్టి సారించారు.

అర్జెంటినా, బ్రెజిల్‌లో వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు, వ్యవసాయం, సాంకేతికత, రక్షణ వంటి రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. BRICS శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ ఆర్థిక పాలన, స్థిరమైన అభివృద్ధి, బహుపక్షీయ సంస్థల సంస్కరణలపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఇక ఘానా, నమిబియాలో ప్రధాని మోడీ గ్లోబల్ సౌత్ సహకారాన్ని గాఢతరం చేయడంపై దృష్టి పెట్టారు. అక్కడ సామర్థ్య వృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులు, విద్యా భాగస్వామ్యాలపై స్నేహపూర్వక చర్చలు జరిగాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆయన పర్యటన భారతదేశం-కరేబియన్ ప్రాంతం మధ్య ఉన్న దీర్ఘకాలిక సాంస్కృతిక, ప్రజలతో ప్రజల సంబంధాలను మరింత బలపరిచింది.

బ్రెజిల్, నమిబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు ప్రధాని మోడీకి తమ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. కాగా, 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు విదేశీ ప్రభుత్వాలచే 27 అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.

Next Story