'పూరీ-హౌరా మధ్య వందే భారత్ రైలు'.. ప్రారంభించిన ప్రధాని మోడీ

by Disha Web Desk 13 |
పూరీ-హౌరా మధ్య వందే భారత్ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: దేశంలో మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలెక్కింది. పూరీ-హౌరా నగరాల మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ఒరిస్సాలో తొలి వందే భారత్ రైలు, దేశంలో 15వ వందే భారత్ రైలు పట్టాలెక్కింది. ఒరిస్సాలోని పూరీ, కటక్ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, ఆధునీకరణతో సహా రూ.8,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు కూడా మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సెమీ హైస్పీడ్ రైలు ద్వారా ఒరిస్సాలోని పూరీ నుంచి పశ్చిమ బెంగాల్ లోని హౌరా వరకు 500 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరున్నర గంటల్లో ప్రయాణించవచ్చు. ఈ రైలు శనివారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

దేశ ప్రగతికి సంకేతం: ప్రధాని

పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన వందే భారత్ రైలు ఇప్పుడు దేశ ప్రగతికి సంకేతంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. కోల్ కతా లేదా ఇతర ప్రాంతాల నుంచి పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లే భక్తులకు కొత్తగా ప్రారంభించిన రైలు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వ్యాపార అవకాశాలు పెరుగుతాయని, యువతకు కొత్త అవకాశాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో పూరీ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story