2026-27 Budget: ధాన్యం ఉత్పత్తుల్లో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by Naga Rani Yarlagadda |

వికసిత్ భారత్ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోందని, గడిచిన పదేళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

2026-27 Budget: ధాన్యం ఉత్పత్తుల్లో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ లో 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, ప్రతిపక్షాల నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి ఎన్డీయే అధికారంలో తీసుకొచ్చిన మార్పులు, దేశంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోందని, గడిచిన పదేళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వం నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తోందని కితాబిచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా త్రాగునీరందించామని తెలిపారు. గత పదేళ్లలో దేశంలో 4 కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చామని, 10 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు కూడా ఇచ్చామని చెప్పారు. లక్షా 80 వేల ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో రోగులకు చికిత్స చేస్తున్నామన్నారు.

పేదరికం నుంచి 25 కోట్లమందికి విముక్తి

గడిచిన పదేళ్లలో దేశంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగించినట్లు రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం 150 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తులతో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులు, పాల ఉత్పత్తిలోనూ భారత్ ముందంజలో ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆక్వారంగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. ఉత్పత్తి రంగంలో తీసుకొచ్చిన కీలక సంస్కరణలతో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయని తెలిపారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానానికి చేరిందన్నారు. అవినీతి రహిత పాలనను అందించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని, ఫలితంగా ప్రజాధనంలో ప్రతీ పైసాను దేశ అభివృద్ధికి ఉపయోగిస్తున్నామన్నారు.

ఇన్కమ్ ట్యాక్స్ లో కీలక సంస్కరణలు.. సొంతంగా అంతరిక్ష కేంద్రం

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ లో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని రాష్ట్రపతి ముర్ము వివరించారు. రూ.12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడంతో మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగిందన్నారు. భారత్ ను ఆధునిక టెక్నాలజీ పవర్ హౌస్ గా మారుస్తున్నామని, పీఎం సూర్యఘర్ యోజనతో సాధారణ ప్రజలు సైతం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని పెంచడంతో.. ప్రజల ప్రయాణ కష్టాలు తీరుతున్నాయన్నారు. న్యూఢిల్లీ నుంచి మిజోరాం రాజధాని అయిన ఐజ్వాల్ కు నేరుగా రైలు సౌకర్యాన్ని కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో 150కి పైగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. ఇక అంతరిక్ష రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ త్వరలోనే సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోబోతోందని ముర్ము తెలిపారు.

Next Story