Murmu: మరో కీలక ఘట్టం.. సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి

by Ramesh Naini |

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో సముద్ర ప్రయాణం చేయనున్నారు.

Murmu: మరో కీలక ఘట్టం.. సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో సముద్ర ప్రయాణం చేయనున్నారు. కర్ణాటకలోని కర్వార్‌ హార్బర్‌ నుంచి డిసెంబర్‌ 28న (ఆదివారం) ఈ ప్రయాణం ఉంటుందని శుక్రవారం రాష్ట్రపతి భవన్‌ అధికారికంగా ప్రకటించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు గోవా, ఝార్ఖండ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే నౌకాదళానికి చెందిన సబ్‌మెరైన్‌లో ఆమె ప్రయాణం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ హోదాలో సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించే క్రమంలో ఈ సముద్ర ప్రయాణం జరగనుంది.

ఇటీవలే రాష్ట్రపతి ముర్ము సాహసోపేత ప్రయాణాలతో దేశవ్యాప్తంగా ఆకర్షణగా నిలిచారు. రెండు నెలల క్రితం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్‌ యుద్ధ విమానంలో గగనవిహారం చేశారు. అంతకు ముందు 2023 మే 8న అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించి, ఈ ఘనత సాధించిన రెండో మహిళా రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, 2006లో మాజీ రాష్ట్రపతి డా. ఏపీ జె. అబ్దుల్‌ కలాం కూడా సుఖోయ్‌-30 యుద్ధ విమానాల్లో ప్రయాణించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ముర్ము తాజా సబ్‌మెరైన్‌ ప్రయాణం నౌకాదళ శక్తిని చాటిచెప్పే మరో కీలక ఘట్టంగా నిలవనుంది.

Next Story