ప్రీమియం ఆటో : ఆటో డ్రైవర్ ‘కూల్’ ఐడియా.. ప్రయాణికుల కోసం సకల సదుపాయాలు!

by Ramesh Naini |   (  Updated:2026-03-22 16:45:35  IST  )

ఎండాకాలంలో ఆటో ప్రయాణం అంటే ఉక్కపోతతో అల్లాడి పోవాల్సిందే. కానీ, నగరంలో ఓ ఆటో డ్రైవర్ మాత్రం ప్రయాణికుల కష్టాన్ని గుర్తించాడు. తన ఆటోను ఏకంగా ఒక మినీ కన్వీనియన్స్ స్టోర్‌ లాగా, ప్రీమియం ఆటోగా మార్చేశాడు.

ప్రీమియం ఆటో : ఆటో డ్రైవర్ ‘కూల్’ ఐడియా.. ప్రయాణికుల కోసం సకల సదుపాయాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు అనగానే ట్రాఫిక్‌తో పాటు క్యాబ్, ఆటో డ్రైవర్లు కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. సాధారణంగా ఆటో ఎక్కితే గమ్యస్థానం చేరే వరకు ట్రాఫిక్ తో విసిగిపోతుంటాం. ముఖ్యంగా ఎండాకాలంలో ఆటో ప్రయాణం అంటే ఉక్కపోతతో అల్లాడి పోవాల్సిందే. కానీ, నగరంలో ఓ ఆటో డ్రైవర్ మాత్రం ప్రయాణికుల కష్టాన్ని గుర్తించాడు. తన ఆటోను ఏకంగా ఒక మినీ కన్వీనియన్స్ స్టోర్‌ లాగా, 'ప్రీమియం ఆటో'గా మార్చేశాడు. ప్రయాణికులకు ఫ్యాన్ గాలి, కూల్ వాటర్, మొబైల్ ఛార్జింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సౌకర్యాలు.. సరసమైన ధరలు..

ఆటో డ్రైవర్ తన సీటు వెనుక ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా ఒక బోర్డును ఏర్పాటు చేశాడు. అందులో ‘వెల్‌కమ్ టు ప్రీమియం ఆటో (Welcome to Premium AUTO)’ అని రాసి, తాను అందిస్తున్న సేవల వివరాలను, వాటి ధరలను పొందుపరిచాడు. అవి ఏంటంటే.. ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు ఉక్కపోత లేకుండా ఉండేందుకు అరగంట పాటు ఫ్యాన్ వేసుకుంటే కేవలం రూ. 10 చెల్లిస్తే చాలు. ప్రయాణంలో దాహం వేస్తే త్రాగడానికి 500 ఎంఎల్ (500 ml) కొత్త కూల్ బిస్లరీ వాటర్ బాటిల్‌ను రూ. 12 లకే విక్రయిస్తున్నాడు. సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోయిన వారి కోసం అన్ని రకాల మొబైల్స్‌కు సరిపోయే యూఎస్బీ (USB) కేబుల్స్ అందుబాటులో ఉంచాడు.

కార్పొరేట్ సంస్థల ‘క్రాస్ సెల్లింగ్’!

ప్రయాణికుల అవసరాలను పసిగట్టి, వారికి మెరుగైన సేవలు అందిస్తూనే.. తన ఆదాయాన్ని రెండు రూపాయలు పెంచుకోవడానికి ఈ ఆటో డ్రైవర్ చేసిన ఈ స్మార్ట్ బిజినెస్ ఆలోచన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కార్పొరేట్ సంస్థలు చేసే ‘క్రాస్ సెల్లింగ్’ (Cross-selling) వ్యాపార వ్యూహాన్ని ఈ ఆటో డ్రైవర్ అద్భుతంగా అమలు చేశాడని పలువురు ప్రశంసిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కస్టమర్ల అవసరాలు తీరుస్తున్న ఈ ‘ప్రీమియం ఆటో’ డ్రైవర్ ఐడియా నిజంగా స్ఫూర్తిదాయకం అని నెటిజన్‌లు కొనియాడారు. ‘వేసవిలో, ముఖ్యంగా మే, జూన్ నెలల్లో ఇది బెస్ట్ ఐడియా’ అని కొందరు అంటుంటే.. ‘మరి బాటిల్ చల్లగా ఉండటానికి ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాడు?’ అని ఇంకొందరు సరదాగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, షగున్ ఓహ్రి (Shagun Ohri) అనే యువతి ఈ ఆటోలో ప్రయాణించింది. ఆటో డ్రైవర్ ఆలోచనకు ఫిదా అయిన ఆమె, ఆటోలో రాసి ఉన్న బోర్డు ఫోటోతో పాటు తాను కొనుగోలు చేసిన వాటర్ బాటిల్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఈ ‘ఆటోమాన్’ బిజినెస్ ఐడియా కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story