బీజేపీ కంచుకోట నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ.. తొలిసారి ఎన్నికల బరిలోకి..

by Naga Rani Yarlagadda |

బీజేపీ కంచుకోట నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ.. తొలిసారి ఎన్నికల బరిలోకి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బీజేపీ కంచుకోట అయిన బిహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జులై 30న ఉపఎన్నిక జరగనుండగా.. అక్కడి నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం జన్ సురాజ్ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. గత దశాబ్ద కాలంగా దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలకు వ్యూహరచన చేసిన కిషోర్, తొలిసారిగా స్వయంగా ఎన్నికల బరిలో నిలవడం ఈ ఉప ఎన్నికతోనే ప్రారంభం కానుంది. ఈ ఉపఎన్నికకు జులై 13వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు ఉండగా.. 30న ఎన్నిక, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

కాగా.. ఎన్నికలో పోటీ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బిహార్ లో బాంకీపూర్ ప్రజలు అత్యంత సంపన్నులు, విద్యావంతులని పేర్కొన్నారు. అత్యుత్తమ అభ్యర్థికి ఓటువేస్తారని, తనపై నమ్మకం ఉంటే తనకు ఓటువేసి గెలిపించాలని కోరారు. పార్టీ తరఫున అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నా.. మిగిలిన 242 మంది ఎమ్మెల్యేల కంటే ధీటుగా పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. బాంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో.. ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఈ స్థానానికి బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ.. అజయ్ అలోక్, నీల్ రతన్ ఘోష్, అజిత్ కుమార్ లాలీ వంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనతా జనశక్తిదళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పటికే సామాజిక కార్యకర్త వీణామాన్విని బరిలోకి దించారు.

Next Story