నితీశ్‌పై ప్రజలకు నమ్మకం లేదు.. వచ్చే ఎన్నికల్లో కొత్త సీఎం: ప్రశాంత్ కిశోర్

by Phanindra |   (  Updated:2025-06-28 16:36:40  IST  )

నితీశ్‌పై 62 శాతం ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని, వచ్చే ఎన్నికల్లో బిహార్‌కు కొత్త సీఎం వస్తారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.

నితీశ్‌పై ప్రజలకు నమ్మకం లేదు.. వచ్చే ఎన్నికల్లో కొత్త సీఎం: ప్రశాంత్ కిశోర్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో 60 శాతం ప్రజలు సీఎం నితీశ్ కుమార్‌తో విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎంగా ఉండబోరని ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అదే సమయంలో తను సీఎం పదవి రేసులో లేనని ఆయన స్పష్టంచేశారు. గతంలో జేడీయూ, బీజేపీ, టీఎంసీ, వైసీపీ వంటి పార్టీలతో కలిసి పనిచేసిన ఆయన.. బిహార్‌లో 62 శాతం మంది ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు.

వీళ్లు తన జన్‌ సురాజ్ పార్టీకి ఓటేస్తారా? లేదంటే లాలూ యాదవ్ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని ఎంచుకుంటారా? అనేదే ప్రశ్న అని కిశోర్ చెప్పారు. వచ్చే రెండు నెలల్లో ఈ విషయంపై కూడా స్పష్టత వచ్చేస్తుందని ఆయన అన్నారు. అయితే ఏం జరిగినా సరే సీఎంగా మాత్రం నితీశ్ కుమార్ ఉండరని స్పష్టంచేశారు. నితీశ్ మానసిక, శారీరక ఆరోగ్యం సరిగా లేదనే విషయం బిహార్ మొత్తానికి తెలుసునని, తనను తనే చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా చూసుకుంటాడని ప్రశ్నించారు.

ఈ విషయం పీఎం మోడీ, అమిత్ షాలకు కూడా తెలుసునన్నారు. బిహార్‌లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం బీజేపీ వద్ద లేదని, కావున ఎవరో ఒకరితో కలిసి వెళ్లడమే వారి వద్ద ఉన్న ఆప్షన్ అని ప్రశాంత్ వివరించారు. అందుకే భారమైనా నితీశ్‌ను ఆ కూటమిలో మోస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే నితీశ్‌కు ఈసారి ఎన్నికల్లో 243 సీట్లలో కనీసం 25 సీట్లు కూడా రావని తేల్చిచెప్పారు.

Next Story