Prakash: ట్రంప్, మోడీ ప్రభుత్వాలు అతివాద భావాజాలన్ని ప్రోత్సహిస్తున్నాయి.. సీపీఎం నేత ప్రకాష్ కారత్

by B.Srinivas |   (  Updated:2025-03-06 15:52:34  IST  )

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వాలు అతివాద భావజాలాలను ప్రోత్సహిస్తున్నాయని ప్రకాష్ కారత్ విమర్శించారు.

Prakash: ట్రంప్, మోడీ ప్రభుత్వాలు అతివాద భావాజాలన్ని ప్రోత్సహిస్తున్నాయి.. సీపీఎం నేత ప్రకాష్ కారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: నరేంద్ర మోడీ (Narendra modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వాలు అతివాద భావజాలాలను ప్రోత్సహిస్తున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ (Prakash karat) విమర్శించారు. కేరళలోని కొచ్చిలో గురువారం జరిగిన పార్టీ కాన్ఫరెన్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో ట్రంప్ సామ్రాజ్యవాదిగా మారారని, మోడీ పాలన నయా ఫాసిస్టులను తలపిస్తోందని ఆరోపించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా మరింత దూకుడుగా మారుతున్న క్రమంలో భారత్ యూఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఆ దేశం ఒంటరిగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చిందని అంతేగాక ఆయుధ ఎగుమతులను అనుమతించిందని తెలిపారు. ఇది సరైన పద్దతి కాదని నొక్కి చెప్పారు.

కేరళలోని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు సీపీఎం వైఖరిని బలహీనపరిచేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఫాసిస్టు ధోరణులను ఎదుర్కోవడానికి వామపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని, చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. కేరళలో అనేక సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల చేతుల్లో అనేక మంది సీపీఎం కార్యకర్తలు హత్య చేయబడ్డారని, రాష్ట్రంలో బీజేపీని వాస్తవంగా ఎవరు వ్యతిరేకిస్తున్నారో ప్రతి ఒక్కరితీ తెలుసన్నారు. నవ-ఫాసిజాన్ని సవాలు చేయకపోతే, అది పూర్తి స్థాయి ఫాసిజంగా పరిణామం చెందుతుందని హెచ్చరించారు.

Next Story