ఇలా కదా.. లీడర్స్ ఉండాల్సింది: రాజకీయాల్లో 'స్టాలిన్' మార్క్ హుందాతనం

by Gantepaka Srikanth |

రాజకీయాల్లో ఎత్తుగడలు, పదవీ కాంక్ష సహజం. కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వీటన్నింటికీ భిన్నంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

ఇలా కదా.. లీడర్స్ ఉండాల్సింది: రాజకీయాల్లో స్టాలిన్ మార్క్ హుందాతనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఎత్తుగడలు, పదవీ కాంక్ష సహజం. కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వీటన్నింటికీ భిన్నంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి, టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తూనే.. తాను మాత్రం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవ్వాలని నిర్ణయించుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడు ఎన్నికల అనంతరం ఏర్పడిన అనిశ్చితిలో, డీఎంకే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలైన వామపక్షాలు (CPI, CPM, CVK), ఇతర స్థానిక పార్టీలు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాయి. తన కూటమిలోని పార్టీల అభీష్టాన్ని స్టాలిన్ ఏమాత్రం కాదనలేదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత కోసం మిత్రపక్షాల నిర్ణయాన్ని ఆయన మనస్ఫూర్తిగా గౌరవించారు. విజయ్ ప్రభుత్వం కొలువుదీరడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తూనే, డీఎంకే మాత్రం అధికారంలో భాగస్వామి కాకుండా ప్రతిపక్షంలోనే కూర్చోవాలని నిర్ణయించుకుంది.

దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు..

ఒక బలమైన రాజకీయ శక్తిగా ఉండి కూడా, అధికారం కోసం పాకులాడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పాత్రను ఎంచుకోవడం స్టాలిన్ రాజకీయ పరిణతికి నిదర్శనమని విశ్లేషకులు కొనియాడుతున్నారు. "అధికారం కంటే విలువలు ముఖ్యం.. మిత్రపక్షాల అభిప్రాయమే సర్వోపరి" అని నిరూపించిన స్టాలిన్, భారత రాజకీయ చరిత్రలో 'ఒకే ఒక్కడు' అనిపించుకుంటున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలను కూల్చడానికి లేదా అధికారం దక్కించుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. కానీ, ప్రత్యర్థి పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చి, హుందాగా ప్రతిపక్షంలో కూర్చోవడం అనేది భారత దేశ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. స్టాలిన్ తీసుకున్న ఈ 'మాస్టర్ స్ట్రోక్' పట్ల నెటిజన్లు, వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

స్టాలిన్ తాజా ట్వీట్..

తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన శాసనసభ సభ్యుల జాబితాను ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసింది. ప్రస్తుత శాసనసభ ఇప్పటికే రద్దు చేయబడింది. దానికి సంబంధించి గవర్నర్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఎన్నుకోబడిన శాసనసభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి, రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది కేవలం అవసరమే కాకుండా, ప్రజాస్వామ్యం యొక్క అత్యంత ముఖ్యమైన విధి కూడా. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేలా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొత్త పరిపాలనను ఏర్పాటు చేయడానికి గవర్నర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని స్టాలిన్ తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story