Pope Francis Dies: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. తదుపరి పోప్ ఎవరంటే?

by Shamantha N |

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.4 బిలియన్ క్యాథలిక్ ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) (Pope Francis) సోమవారం కన్నుమూశారు.

Pope Francis Dies: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. తదుపరి పోప్ ఎవరంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.4 బిలియన్ క్యాథలిక్ ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) (Pope Francis) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఆయన.. సోమవారం ఉదయం 7:35 గంటలకు రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన మృతిని విషయాన్ని వాటికన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత గత నెల డిశ్చార్జి అయ్యారు. 2013లో 16వ పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత ఫ్రాన్సిస్‌ ఈ బాధ్యతలు చేపట్టారు. పోప్ ఫ్రాన్సిస్‌ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే. ఆయన్ను ప్రజల పోప్‌ అంటారు. పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితమై పనిచేశారు. 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు.

మరణానికి కొన్ని గంటల ముందు కూడా..

పోప్ ఫ్రాన్సిస్ తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు. వాటికన్ ఆర్థిక వ్యవస్థ, పాలనను సంస్కరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. మతపరమైన సంప్రదాయాలు, సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను అనుసరించారు. వలసదారులు, పేదలు, ఖైదీలు, అణగారినవారు అందరికీ చోటు ఇవ్వాలనే తపనతో ఆయన ముందుకు సాగారు. పర్యావరణ పరిరక్షణ, అణు ఆయుధాలపై వ్యతిరేకత, శాంతియుత జీవన విధానంపై ఆయన చేసిన ప్రచారం అనేక మందికి మార్గదర్శనం అయ్యింది. దీంతోపాటు చర్చిలలో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ప్రజలతో మాట్లాడారు. ఆదివారం ఈస్టర్‌ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలకు సందేశం ఇచ్చారు. వాటికన్‌ నగరంలోని పీటర్స్‌ స్క్వేర్‌లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌, హ్యాపీ ఈస్టర్‌..!’ అని పోప్‌ స్వయంగా చెప్పారు. తర్వాత ఆయన సందేశాన్ని ఆర్చి బిషప్‌ డియాగో రావెలి చదివి వినిపించారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్‌, కాంగో, మయన్మార్‌లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.

పోప్ మృతి తర్వాత..

పోప్ మరణం తర్వాత వాటికన్ ఇంటర్‌రెగ్నమ్ కాలంలోకి ప్రవేశిస్తుంది. పోప్ మరణం, కొత్త నాయకుడి ఎన్నిక మధ్య సమయాన్ని ఇంటర్ రెగ్నమ్ అంటారు. వాటికన్ ఆస్తి, ఆదాయాల నిర్వాహకుడయిన కామెర్లెంగో పోప్ మరణాన్ని ధ్రువీకరిస్తారు. పోప్ బాప్టిస్మల్ పేరును మూడుసార్లు పిలవడంతో మృతిని ఖరారు చేస్తారు. పోప్ మరణం తర్వాత అతని నుదిటిపై చిన్న వెండి సుత్తిని తట్టే ఆచారం గతంలో ఉండేది. కానీ, 1963 తర్వాత ఆ సంప్రదాయం ముగిసింది. పోప్ మరణించాడని వాటికన్ దాని అధికారిక మార్గాల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంది. పోప్ అధికార భవనం పాపల్ అపార్ట్‌మెంట్‌ను కామెర్లెంగో లాక్ చేస్తారు. ఆ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ అధికార ముద్ర, శాసనాన్ని నాశనం చేస్తారు. దీంతో పోప్ పాలన ముగింపు జరుగుతుది. పాపల్ పరివర్తనను నియంత్రించే యూనివర్సి డొమినిసి గ్రెగిస్ రాజ్యాంగం ప్రకారం.. పోప్ మరణించిన 4-6 రోజులలోపు అతని అంత్యక్రియలు జరగాలి. పోప్ భౌతికదేహాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాలో ఖననం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు సంతాప దినాలు నిర్వహిస్తారు.

కొత్త పోప్ ఎన్నిక

తమ తదుపరి పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియ పాపల్ కాంక్లేవ్ ప్రారంభవుతుంది. పోప్ మరణించిన 15-20 రోజుల తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 80 ఏళ్లలోపు కార్డినల్స్ ఈ రహస్య ప్రక్రియ కోసం వాటికన్‌లో సమావేశమవుతారు. వారందరూ సిస్టీన్ చాపెల్ లోపల సమావేశమవుతారు. వారికి బాహ్య ప్రపంచం నుంచి సంబంధాలు ఉండవు. మీడియా, ఫోన్ కూడా అందుబాటులో ఉండదు. ఒక అభ్యర్థికి మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చే వరకు బహుళ రౌండ్లలో ఓట్లు వేస్తారు. ఆ తర్వాత కొత్త పోప్ ఎన్నిక జరుగుతుంది. కొత్త పోప్ ఎన్నిక తర్వాత.. ఎన్నుకున్న వ్యక్తి ఆ పాత్రను అంగీకరిస్తున్నారా? లేదా? అని అధికారికంగా అడుగుతారు. ఒకవేళ అంగీకరిస్తే, ఆ వ్యక్తి ఒక పాపల్ పేరును ఎంచుకోవాలి. ఇది తరచుగా గత పోప్ ల వల్ల ప్రేరణ పొందింది. అప్పుడు సీనియర్ కార్డినల్ డీకన్ సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీ నుంచి లాటిన్‌లో "హబేమస్ పాపం" (మనకు పోప్ ఉన్నాడు) అని ప్రకటిస్తారు. ఆ తర్వాత కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్వ్వేర్ తో తన అనుచరులను పలకరించి.. పోప్ గా తొలి ఆశ్వీర్వాదారు అందిస్తారు.

Next Story