ఢిల్లీలో పోలింగ్.. రూ.5 లక్షలతో పట్టుబడిన సీఎం పీఏ

by Yella Dhawani Reddy |

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi assembly election voting) కొనసాగుతోంది.

ఢిల్లీలో పోలింగ్.. రూ.5 లక్షలతో పట్టుబడిన సీఎం పీఏ
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi assembly election voting) కొనసాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల (Assembly Elections)కు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతోంది. అన్ని స్థానాల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP), BJP, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఇద్దరు వ్యక్తులు రూ.5 లక్షల నగదుతో పోలీసులకు పట్టుబడ్డారు.

ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కల్కాజీలోని పోలింగ్ కేంద్రాల వద్ద వారు డబ్బుతో తిరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ (FST) వారిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకుంది. అయితే, నిందితుల్లో ఒకరు సీఎం ఆతిశీ పీఏకు అసిస్టెంట్ కాగా, మరొకరు డ్రైవర్‌గా గుర్తించారు.

కాగా, 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని మొత్తం 1.5 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించబోతున్నారు. ఇక అధికార AAP ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుండగా, పాతిక సంవత్సరాలకు పైగా ఢిల్లీ పీఠానికి దూరంగా ఉన్న BJP విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. 2013 వరకు 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని చూస్తోంది.

Next Story