Madras Highcourt: అధికారంలో ఉన్న రాజకీయ నేతలు తమను తాము రాజులుగా భావించకూడదు: మద్రాస్ హైకోర్టు

by S Gopi |

రాజకీయ నాయకులు ఈ దేశ రాజులన్నట్లుగా చాలా విషయాలు చెబుతున్నారు.

Madras Highcourt: అధికారంలో ఉన్న రాజకీయ నేతలు తమను తాము రాజులుగా భావించకూడదు: మద్రాస్ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న డీఎంకే నేత, మాజీ మంత్రి కె పొన్ముడిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు పోలీసులు ఆయనపై సరైన చర్యలు తీసుకోకపోతే సీబీఐ విచారణ కోసం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పి. వెల్మురుగన్.. ఆర్టికల్ 19ని అడ్డు పెట్టుకుని రాజకీయ నేతలు ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్నారు. సమాజంలో వివిధ వర్గాలతో కలిసి ఉన్నాం. ఈ దేశం రాజకీయ నేతలకు చెందినది మాత్రమే కాదు, ఆ విషయాన్ని వారు గుర్తించుకోవాలి. ప్రతి రాజకీయ నాయకుడు మైక్ తీసుకోగానే తమని తాము రాజుల్లా భావించుకోకూడదని స్పష్టం చేశారు. బహిరంగంగా మైక్ తీసుకునే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రజలకు బలమైన సందేశం ఇచ్చేలా ప్రవర్తించాలి. రాజకీయ నాయకులు ఈ దేశ రాజులన్నట్లుగా చాలా విషయాలు చెబుతున్నారు. వారు ఏమి చెప్పినా, తమ తప్పు ఉండదని అనుకుంటున్నారు. కోర్టులు ఈ విషయాలను మౌనంగా చూస్తూ ఊరుకోదని వెల్మురుగన్ అన్నారు. అనంతరం, ఈ కేసు వ్యవహారంపై తదుపరి విచారణను ఆగష్టు 1వ తేదీకి వాయిదా వేశారు. కాగా, చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొన్ముడి తన ప్రసంగంలో ఒక సెక్స్ వర్కర్ ఒక వ్యక్తిని పురుషుడి మతం ప్రకారం లైంగిక స్థానాలను వివరించే ముందు అతను శైవుడా లేదా వైష్ణవుడా అని అడుగుతాడంటూ 'జోక్' చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉండటంతో పొన్ముడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పరిస్థితి చేయి దాటడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు.

Next Story