Political parties: 345 రాజకీయ పార్టీలను రద్దు చేసిన ఈసీ.. కారణమిదే?

by B.Srinivas |

రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీచేయని పార్టీలపై ఈసీ చర్యలకు దిగింది.

Political parties: 345 రాజకీయ పార్టీలను రద్దు చేసిన ఈసీ.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీచేయని పార్టీలపై ఎన్నికల సంఘం (EC) చర్యలకు దిగింది. ఈ మేరకు 345 రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్‌డ్ పొలిటికల్ పార్టీస్ (RUPPS) ను గుర్తించి వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు గురువారం తెలిపింది. ఈ పార్టీలు 2019 నుంచి ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనలేదని ఈసీ గుర్తించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్టరై ఉన్న ఈ పార్టీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, వాటికి ఆఫీసులు సైతం లేవని తెలిపింది. ఈ పార్టీలు ఆక్టివ్‌గా పని చేస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొంది. ఈ క్రమంలోనే వాటిని తొలగించేందుకు సిద్ధమైంది. అలాగే ఆర్‌యూపీపీ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. త్వరలోనే ఆయా పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయా పార్టీల వివరణ సైతం తీసుకున్న తర్వాత చర్యలు తీసుకోనుంది.

ప్రస్తుతం ఎన్నికల కమిషన్ వద్ద 2800కి పైగా గుర్తింపు లేని నమోదిత పార్టీలున్నాయి. అయితే వీటిలో చాలా పార్టీలు అవసరమైన నిబంధనలు పాటించడంలేదు. ఆయా పార్టీలను గుర్తించడానిక దేశ వ్యాప్తంగా ప్రక్రియను నిర్వహించి వాటిలో 345 పార్టీలను గుర్తించారు. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ పార్టీలను తొలగిస్తున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. కాగా, ఒక పార్టీ రాజకీయ పార్టీ అధికారికంగా గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో పోలైన ఓట్లలో సుమారు 6 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. లేదా అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో నిర్దిష్ట సీట్లు గెలుచుకోవాలి.

Next Story