Police attack in Australia: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై పోలీసుల దాడి..

by Shamantha N |

ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో 42 ఏళ్ల భారతీయుడు గౌరవ్ కుంది అనే వ్యక్తి పోలీసుల హింసాత్మక చర్యల కారణంగా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోమాలో ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

Police attack in Australia: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై పోలీసుల దాడి..
X

దిశ, నేషనల్ డెస్క్: ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో 42 ఏళ్ల భారతీయుడు గౌరవ్ కుంది అనే వ్యక్తి పోలీసుల దాడి కారణంగా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోమాలో ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన 2020లో అమెరికాలో (america) జార్జ్ ఫ్లోయిడ్ మరణాన్ని గుర్తు చేస్తోంది. స్థానిక మీడియా విడుదల చేసిన వీడియోల్లో ఒకదానిలో పోలీసులు అతని మెడపై మోకాలితో గట్టిగా ఒత్తుపెడుతున్న దృశ్యం కనిపించింది. ఘటన సమయంలో గౌరవ్ భార్య అమృత్‌పాల్ కౌర్‌తో ఉన్నాడు. ఇద్దరూ మేము ఏమీ తప్పు చేయలేదు అంటూ పోలీసులతో వాగ్వాదం జరిపారు. ఆ తరుణంలోనే పోలీసులు గౌరవ్‌ను నేలపైకి తోసేసి అతని మెడపై మోకాళ్లతో ఒత్తారు. ఈ దృశ్యాలను అమృత్‌పాల్ కౌర్ తన మొబైల్‌లో చిత్రీకరిస్తూ ఇది అన్యాయం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

గౌరవ్ బ్రెయిన్ డ్యామేజ్

గౌరవ్ ముఖం ఒక పోలీసు వాహనానికి ఢీకొన్నట్లు ఆమె పేర్కొన్నా ఆ క్షణం భయంతో వీడియోను ఆపేశానని తెలిపారు. అనంతరం గౌరవ్ పరిస్థితి విషమించడంతో, ఆమె అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లమని అధికారులను వేడుకుంది. డాక్టర్లు గౌరవ్‌కు తీవ్రమైన బ్రెయిన్ డ్యామేజ్ అయిందని తెలిపారు. అతడి మెదడు స్పందిస్తే మేల్కొనే అవకాశముంది. లేకపోతే తిరిగి తేరుకోవడం కష్టమే అని డాక్టర్లు చెప్పారని మీడియాతో అమృత్ పాల్ పేర్కొన్నారు. మరోవైపు, దాడి సమయంలో గౌరవ్ హింసాత్మకంగా ప్రవర్తించాడు అని పోలీసులు పేర్కొంటున్నారు. అడిలైడ్ (adilaide) పోలీస్ కమిషనర్ గ్రాంట్ స్టీవెన్స్ ఈ ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే విచారణ ప్రారంభించామన్నారు. అతని ఆరోగ్యం విషయంలో మేము ఆశతో ఉన్నామని త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నామన్నారు. జార్జ్ ఫ్లోయిడ్ మరణానంతరం ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థపై నెగెటివ్ దృష్టిని కలిగించిన దుర్ఘటనలను మళ్లీ గుర్తుకు తెస్తోంది. ఆస్ట్రేలియాలోని పోలీసు వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story