మా లక్ష్యం వికసిత తమిళనాడు.. రూ.4800 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ

by Phanindra |

మాల్దీవుల నుంచి నేరుగా తమిళనాడు పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లారు. తమ లక్ష్యం వికసిత తమిళనాడు అని చెప్పిన ఆయన.. రూ.4800 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు.

మా లక్ష్యం వికసిత తమిళనాడు.. రూ.4800 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తమిళనాడును నిర్లక్ష్యం చేస్తోందని, నిధులు ఇవ్వడం లేదని డీఎంకే నేతలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోడీ పరోక్షంగా స్పందించారు. తాను ప్రధానిగా ఎన్నికయిన తర్వాత గత పదేళ్లలో ఏకంగా రూ.3 లక్షల కోట్ల నిధులకు తమిళనాడుకు అందించామని, ఇది అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే చాలా ఎక్కువని మోడీ అన్నారు. అలాగే తమిళనాడుకు 11 కొత్త మెడికల్ కాలేజీలు అందించామని, తీర ప్రాంతాల్లో నివశించే జాలర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తొలి ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.

నీలి విప్లవంలో భాగంగా అందరన్నీ కలుపుకొని పోతూ తీరప్రాంత ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తున్నామని చెప్పారు. శనివారం నాడు మాల్దీవుల స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం రెండ్రోజుల తమిళనాడు పర్యటన కోసం ప్రధాని మోడీ నేరుగా తూత్తుకుడి చేరుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర వీరులకు నివాళులర్పించిన ఆయన.. తూత్తుకుడిలో రూ.4,800 కోట్లపైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇటీవలే యూకేతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని గుర్తుచేసిన ఆయన.. ‘ఇది ప్రపంచానికి భారత్‌పై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం. ఈ ఆత్మవిశ్వాసంతోనే వికసిత్ భారత్‌ను అలాగే వికసిత్ తమిళనాడును నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.

‘సెప్టెంబరులో తూత్తుకుడి ఇంటర్నేషనల్ కంటైనర్ టర్మినల్ ప్రారంభించాను. ఇప్పుడు రూ.4,800 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నా. ఎయిర్‌పోర్టులు, హైవేలు, పోర్టులు, రైల్వేలు, పవర్ సెక్టార్‌కు చెందిన ఈ ప్రాజెక్టులు తమిళనాడు అభివృద్ధిలో కీలకం. తూత్తుకుడి అభివృద్ధికి మోడల్‌గా మారుతుంది’ అని మోడీ అన్నారు. అలాగే యూకేతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంతో భారత్‌ నుంచి అక్కడకు వెళ్లే 99 శాతం ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు ఉండవని, దీంతో భారతీయ ఉత్పత్తులకు ఇంగ్లండ్‌లో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు.

తద్వారా భారత్‌లో సదరు ఉత్పత్తుల తయారీ కూడా పెరుగుతుందన్నారు. ఈ ఒప్పందం తమిళనాడులోని యువత, చిన్న పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ట్యూటికోరన్ ఎయిర్‌పోర్టులో రూ.450 కోట్లతో నిర్మించిన కొత్త టర్మినల్ బిల్డింగ్‌ను కొనియాడిన ఆయన.. దీంతో గతంలో కేవలం 3 లక్షల మంది ప్రయాణికులకే ఆతిథ్యం ఇవ్వగలిగిన విమానాశ్రయం ఇకపై 20 లక్షల మంది ప్రయాణికులను తట్టుకుంటుందని చెప్పారు.

ఇవికాక పలు రోడ్డు, రైల్వే, పవర్ ప్రాజెక్టులకు కూడా మోడీ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది తమిళనాడు అంసెబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీ, ఏఐడిఎంకే, టీవీకే, డీఎంకే తదితర పార్టీలన్నీ తమిళనాడులో ప్రచారం మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రచారానికి బూస్ట్ ఇచ్చేందుకే తమిళనాడులో మోడీ పర్యటిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

Next Story