మోడీకి నమీబియా అత్యున్నత పౌరపురస్కారం.. 27వ అంతర్జాతీయ గౌరవం!

by Phanindra |

మోడీకి నమీబియా అత్యున్నత పౌరపురస్కారం అందించింది. ఇది ప్రధానికి దక్కిన 27వ అంతర్జాతీయ గౌరవం!

మోడీకి నమీబియా అత్యున్నత పౌరపురస్కారం.. 27వ అంతర్జాతీయ గౌరవం!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐదు దేశాల పర్యటనలో చివరగా నమీబియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘనస్వాగతం లభించింది. నమీబియా పార్లమెంటులో ప్రసంగించే ముందు ఆయనకు ఆ దేశ పార్లమెంటు సభ్యులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ తర్వాత భారత దేశం గురించి మోడీ ప్రసంగించారు. అనంతరం మోడీకి ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ యాన్సియెంట్ వెల్‌విషియా మిరాబిలిస్’ అవార్డును అందించారు.

2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీకి దక్కిన 27వ అంతర్జాతీయ గౌరవం ఇది. నమీబియా ప్రెసిడెంట్ నెటుంబో నంది-ఎందైత్వా చేతుల మీదుగా మోడీ ఈ అవార్డు అందుకున్నారు. అంతకుముందు ప్రెసిడెంట్ నెటుంబో నంది-ఎందైత్వాతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు మోడీ. అనంతరం ఎనర్జీ, హెల్త్‌కేర్ సహా పలుకీలక రంగాల్లో సహకారాన్ని మెరుగుపరుచుకునేలా నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేసుకున్నాయి.

బ్రెజిల్‌లోనూ అరుదైన గౌరవం..

నమీబియాకు వచ్చే ముందు బ్రెజిల్‌లో తన పర్యటనను ప్రధాని మోడీ ముగించారు. రెండ్రోజుల బ్రిక్స్ సమావేశాల తర్వాత, మరో రెండ్రోజులపాటు బ్రెజిల్‌ పర్యటనలో మోడీ గడిపారు. అనంతరం బ్రెజిల్ అత్యున్నత పౌరపురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సౌతర్న్ క్రాస్’ అవార్డును భారత ప్రధాని అందుకున్నారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన స్వీకరించారు. దీన్ని భారత్‌లోని 140 కోట్ల మందికి అంకితం చేస్తున్నట్లు మోడీ చెప్పారు.

Next Story