యువతపై నమ్మకమే నా శక్తి.. 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' ముగింపులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

‘ఈ ప్రయాణం దేశానికి ఎంత ముఖ్యమో, మీ జీవితాలకు కూడా అంతకంటే ముఖ్యం. మీ విజయం దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది. యువత రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు’ అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

యువతపై నమ్మకమే నా శక్తి.. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నవ భారత్ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని, వారి వినూత్న ఆలోచనలు, శక్తిసామర్థ్యాలే దేశాన్ని ముందుకు నడిపిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2026' ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత్ స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు జరుపుకోబోయే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. ‘ఈ ప్రయాణం దేశానికి ఎంత ముఖ్యమో, మీ జీవితాలకు కూడా అంతకంటే ముఖ్యం. మీ విజయం దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది. యువత రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు’ అని ఆయన పిలుపునిచ్చారు.

యువతపై నమ్మకమే నా శక్తి..

తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను మొదటిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు మీలో చాలామంది పుట్టి ఉండరు. 2014లో నేను ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు మీరంతా చిన్న పిల్లలు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి నేటి ప్రధాని వరకు.. నేను ఎప్పుడూ యువతరాన్ని విశ్వసిస్తూనే ఉన్నాను. మీ ప్రతిభ, సామర్థ్యమే నాకు అసలైన శక్తినిస్తాయి.’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జెన్ జెడ్' (Gen Z)కు ఇది ఒక 'థింక్ ట్యాంక్'

ఈ యంగ్ లీడర్స్ డైలాగ్ అతి తక్కువ సమయంలోనే దేశాభివృద్ధిలో యువత నేరుగా భాగస్వామ్యమయ్యే అతిపెద్ద వేదికగా మారిందని మోడీ కొనియాడారు. భారతీయ 'జెన్ జెడ్' (Gen Z) సృజనాత్మకతకు ఇది ఒక 'థింక్ ట్యాంక్' లా పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని, యువ నాయకులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలను పరిశీలించి వారితో ముచ్చటించారు. జనవరి 9 నుంచి 12 వరకు జరిగిన ఈ డైలాగ్‌లో దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా యువత పాల్గొన్నారు. డిజిటల్ క్విజ్, వ్యాసరచన పోటీలు, రాష్ట్ర స్థాయి విజన్ ప్రజెంటేషన్లు వంటి కఠినమైన మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా జాతీయ స్థాయి విజేతలను ఎంపిక చేశారు.

Next Story