Pm modi: ఇండియాను సృజనాత్మక కేంద్రంగా మారుస్తాం.. ప్రధాని మోడీ

by B.Srinivas |

భారత్‌లో సృజనాత్మకత వెల్లువెత్తుతోందని ప్రధాని మోడీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు క్రియేటర్లు మరింత ఊపును తీసుకురాగలరని తెలిపారు.

Pm modi: ఇండియాను సృజనాత్మక కేంద్రంగా మారుస్తాం.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో సృజనాత్మకత వెల్లువెత్తుతోందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు క్రియేటర్లు మరింత ఊపును తీసుకురాగలరని తెలిపారు. రాబోయే రోజుల్లో క్రియేటర్లు దేశ జీడీపీకి గణనీయంగా దోహదపడతారని నొక్కి చెప్పారు. గురువారం ఆయన ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ (Waves)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘భారతదేశ ఆరెంజ్ ఎకానమీ కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి అనే మూడు బలమైన స్తంభాలపై ఆధారపడి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో దేశ జీడీపీలో ఈ రంగం గణనీయమైన వాటాను కలిగి ఉంటుంది’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ యానిమేషన్ మార్కెట్ విలువ 430 బిలియన్ డాలర్లకు పైగా ఉందని, రాబోయే పదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందన్నారు. 100కి పైగా ప్రపంచ దేశాల్లో భారతీయ సినిమాలు ప్రదర్శింపబడుతున్నాయని తెలిపారు. విదేశీ ప్రేక్షకులు భారతీయ సినిమాలను చూడటమే గాక వాటికి అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. భారతదేశం చలనచిత్ర నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, మ్యూజిక్‌కు ప్రపంచ కేంద్రంగా మారిందన్నారు.

మానవులను రోబోలుగా మార్చొద్దు

నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ టైంలో మానవ సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి అదనపు కృషి అవసరమని నొక్కి చెప్పారు. మానవులను రోబోలుగా మార్చొద్దని, వారిని మరింత సున్నితంగా మార్చాలన్నారు. మానవత్వ వ్యతిరేక ఆలోచనల నుండి యువతరాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. నిజమైన మానవ పురోగతిని సాంకేతికత, సమాచారం లేదా వేగం ద్వారా మాత్రమే కొలవలేమన్నారు. క్రియేటివిటీ ఉన్న వ్యక్తులు తమ శక్తి సామర్థ్యంతో సృజనాత్మక మార్పునకు నాయకత్వం వహించాలన్నారు. భారత్‌ను ప్రపంచ సృజనాత్మక కేంద్రంగా మార్చడంతో తోడ్పడాలని సూచించారు.

భవిష్యత్‌లో వేవ్స్ అవార్డులు

కళలు, సృజనాత్మకత రంగంలో భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేవ్స్ అవార్డులు ప్రారంభిస్తామన్నారు. వేవ్స్ అనేది కేవలం సంక్షిప్త రూపం కాదని కల్చర్, క్రియేటివిటీలకు సార్వత్రిక అనుసంధానం అని కొనియాడారు. యువత కొత్త ఆలోచనలతో ఒక దగ్గర చేరే చోటు అని ప్రశంసించారు. భారత్ చలనచిత్ర నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీతం, ప్రత్యక్ష కచేరీలకు ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, కాబట్టి పెట్టుబడిదారులు అందులో ఇన్వెస్ట్ మెంట్స్ ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రతినిధులు, 1,000 మంది క్రియేటర్లు, 300 కంపెనీలు,350 స్టార్టప్‌లు పాల్గొన్నాయి.

Next Story