Pm modi: పహెల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. ప్రధాని మోడీ

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఈ నెల 22న జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది.

Pm modi: పహెల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఈ నెల 22న జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని దేశమంతా డిమాండ్లు వ్యక్తమయ్యాయి. టెర్రర్ అటాక్‌ను సీరియస్‌గా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరుల వీసాలు రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి కేంద్రం పూర్తి కార్యాచరణలోకి దిగినట్టు కనిపిస్తోంది. ప్రధాని మోడీ (Modi) నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పహెల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునే సమయం, లక్ష్యం, ప్రణాళికను రూపొందించే ఫ్రీడమ్ త్రివిధ దళాలకు ఉందని స్పష్టం చేశారు. టెర్రరిస్టులకు తగిన సమాధానం ఇవ్వడానికి అవసరమైన ఏవైనా చర్యలు తీసుకోగల సామర్థ్యం సైన్యానికి ఉందని తెలిపారు. ఉగ్రవాదానికి తగిన దెబ్బ కొట్టడమే మన దేశ దృఢ సంకల్పమని చెప్పారు. సాయుధ దళాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

ఊహకు అందని విధంగా చర్యలు

దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్న వారిని పట్టుకుంటామని మోడీ ప్రతిజ్ఞ చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాడికి పాల్పడిన వారు ప్రపంచం నలుమూలల ఎక్కడున్నా వేటాడి వారిని ఊహకు అందని విధంగా కఠినంగా శిక్షలు విధిస్తామని మోడీ హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారికి తగిన రీతిలో బదులిస్తామని, భారత్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిన పాకిస్థాన్‌కు ఇది ఒక సూచనగా పరిగణిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించబోదని ఆ ముప్పును తుడిచిపెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లకు ఎటువంటి అడ్డంకులూ లేవని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా సైన్యం అంకిత భావం, వారి సామర్థ్యాలను ప్రశంసించినట్టు తెలుస్తోంది.

90 నిమిషాల పాటు డిస్కషన్

త్రివిధ దళాల ఉన్నతాధికారుతో జరిగిన సమావేశం 90 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భేటీలో ముఖ్యంగా పహెల్గాం ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఇండియా పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపైనా చర్చించినట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ భేటీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులైన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షన్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిలు హాజరయ్యారు. ముగ్గురు సైన్యాధిపతులు ఒకే ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

పారామిలటరీ బలగాలతో హోం మంత్రిత్వ శాఖ భేటీ

ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశానికి ముందు ఇదే అంశంపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పారామిలటరీ బలగాలతోనూ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సశస్త్ర సీమా బల్ (SSB), అస్సాం రైఫిల్స్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఈ మీటింగ్‌లో సమీక్షించినట్టు తెలుస్తోంది. అనంతరం గోవింద్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వీసాలు రద్దు చేయబడిన పాకిస్తానీ జాతీయులు నిర్ణీత గడువులోగా భారత్ విడిచి వెళ్లేలా చూడాలని ఆదేశించారు.

నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశం

ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. పహల్గామ్ దాడి తర్వాత ఇదే తొలి కేబినెట్ భేటీ. ఉదయం11 గంటలకు సమావేశం జరగనుండగా ఇందులో ఉగ్రదాడికి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story