నేరాలకు ఏఐ వాడకుండా చర్యలు అవసరం: ప్రధాని మోడీ

by Phanindra |

నేరాలకు ఏఐ వాడకుండా చర్యలు అవసరమని ప్రధాని మోడీ అన్నారు. జీ20 సదస్సులో ఆయన కొన్ని సూచనలు చేశారు.

నేరాలకు ఏఐ వాడకుండా చర్యలు అవసరం: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కృత్రిమ మేధ అంతర్జాతీయంగా మంచికి ఉపయోగపడేలా చూడాలని, దాని దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సౌతాఫ్రికాలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ‘ఎ ఫెయిర్ అండ్ జస్ట్ ఫ్యూచర్ ఫర్ ఆల్ - క్రిటికల్ మినరల్స్, డీసెంట్ వర్క్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ అంశంపై ఆయన మాట్లాడారు.

‘ఏఐ దుర్వినియోగం అరికట్టేందుకు మనందరం కలిసి పనిచేయాలి. అందుకోసం అంతర్జాతీయంగా అమలయ్యే మూల నిబంధనలను తయారు చేయాలి. మానవ పర్యవేక్షణ, సేఫ్టీ బై డిజైన్, పారదర్శకత, ఏఐని డీప్‌ఫేక్‌లు, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడకుండా కఠినమైన నియంత్రణలు ఏర్పాటు చేయాలి’ అని మోడీ సూచించారు. మానవ జీవితాలు, భద్రత, ప్రజల నమ్మకంపై ప్రభావం చూపించే ఏఐ వ్యవస్థలు బాధ్యతాయుతంగా, జవాబుదారీగా ఉండాలన్నారు. మానవ సామర్థ్యాలను ఏఐ పెంచేలా ఉండాలని, అయితే నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఎప్పుడూ మనుషులకు ఉండాలని ఆయన చెప్పారు.

ప్రజల్లో ఏఐ నైపుణ్యాలు పెంచాలని, జీ20 దేశాలు ఈ ట్యాలెంట్ పెంచేందుకు ఫ్రేమ్‌వర్క్ తయారు చేస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగనుందని, దీనికి జీ20 సభ్యదేశాలన్నీ హాజరవ్వాలని ఆయన ఆహ్వానించారు.

Next Story