మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం.. కరీబియన్‌లో యూపీఐ షురూ!

by Phanindra |   (  Updated:2025-07-04 15:16:12  IST  )

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం అని ప్రధాని మోడీ చెప్పారు. కరీబియన్‌ దేశంలో యూపీఐ సేవలు ప్రారంభించారు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం.. కరీబియన్‌లో యూపీఐ షురూ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐదు దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టోబాగోకు ప్రధాని మోడీ చేరుకున్నారు. ఇక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం భారత్ ఒక అవకాశాల దేశమని, ఇక్కడి ఫలాలు అవసరంలో ఉన్న పేదవారికి అందుతున్నాయని ప్రధాని చెప్పారు. ‘ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతుతన్న ఆర్థిక వ్యవస్థ భారత్. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నాం. ఈ దేశంలోని అభివృద్ధి ఫలాలు అవసరంలో ఉండే పేదవారికి అందుతున్నాయి’ అని వివరించారు. అలాగే పేదవారిని ఆర్థికంగా నిలబెడితే పేదరికాన్ని నిర్మూలించవచ్చని భారత్ నిరూపించిందన్నారు. దీంతో కోట్లాది మంది ప్రజల్లో పేదరికంపై గెలవగలమనే ధైర్యం వచ్చిందన్నారు. ‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్ భారతదేశమే. ఈ స్టార్టప్‌లలో దాదాపు సగం కంపెనీల్లో మహిళలే డైరెక్టర్లు. సుమారు 120 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాయి’ అని మోడీ చెప్పుకొచ్చారు. ‘ఏఐ కోసం జాతీయ మిషన్, సెమీకండక్టర్, క్వాంటమ్ కంప్యూటింగ్‌లు దేశానికి కొత్త ఇంజిన్లుగా మారాయి. ఒకరకంగా చెప్పాలంటే భారత్‌లో ఇన్నొవేషన్ ఒక మాస్ మూవ్‌మెంట్‌గా మారుతోంది’ అని పేర్కొన్నారు.

విండీస్ బౌలర్ల కన్నా యూపీఐ ఫాస్ట్..

ఇదే సమయంలో భారత్‌లో ఉపయోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)ను కూడా చూపించిన మోడీ.. డిజిటల్ పేమెంట్స్‌లో ఇది విప్లవాత్మక మార్పులు తెచ్చిందని చెప్పారు. ‘ప్రపంచంలో జరుగుతున్న రియల్‌టైం పేమెంట్లలో 50 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. దీన్ని సాధ్యం చేసిన యూపీఐని.. ఈ ప్రాంతంలో అడాప్ట్ చేసుకున్న తొలిదేశంగా నిలిచిన ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ధన్యవాదాలు. దీంతో డబ్బులు పంపండం మెసేజ్ చేసినంత ఈజీ. వెస్టిండీస్ బౌలింగ్ కన్నా యూపీఐ పేమెంట్స్ వేగంగా ఉంటాయి’ అంటూ మోడీ చమత్కరించారు. అలాగే మౌలిక సదుపాయాలు, డిఫెన్స్, మానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో భారత్ ఎదుగుదలను కూడా వివరించారు.

Next Story