- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన మోడీ.. 40 ఏళ్ల తర్వాత ఆ దేశానికి భారత ప్రధాని
ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కీలక చర్చలు జరపనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనకు ఇవాళ బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. పర్యటనకు ముందు ప్రధాని మోడీ తన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు తాను జులై 6 నుండి 8 వరకు ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈనెల 8,9 తేదీలలో ఆస్ట్రేలీయాలో ఈ నెల 10,11 తేదీల్లో న్యూజిలాండ్ లో పర్యటించనున్నారు.
ఇండోనేషియాతో వ్యూహాత్మక బంధం:
2018లో తాను ఇండోనేషియాలో పర్యటించిన సమయంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి యోగ్యకర్తలోని ప్రసిద్ధ 'ప్రాంబనన్' ఆలయ సముదాయాన్ని సందర్శించనున్నారు.
ఆస్ట్రేలియాలో కీలక చర్చలు:
ఇండోనేషియా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ నేరుగా మెల్‌బోర్న్ చేరుకుంటారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం-పెట్టుబడులు, విద్య, మొబిలిటీ, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు, క్రీడలు, ప్రజా సంబంధాల వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటన భారత్-ఆస్ట్రేలియా వ్యూహాత్మక బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని ప్రధాని పేర్కొన్నారు. అక్కడ కూడా ఆయన భారత సంతతి ప్రజలతో భేటీ కానున్నారు.
40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు భారత ప్రధాని:
పర్యటన చివరి దశలో ప్రధాని మోదీ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన సాగనుంది. గత ఏడాది మార్చిలో పీఎం లక్సన్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన కల్పించిన సానుకూల వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్తూ.. ఆర్థిక, వాణిజ్య, వాణిజ్యపరమైన భాగస్వామ్యాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.






