ఆ పార్టీలతో అభివృద్ధి అసాధ్యం.. విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు

by Phanindra |

బిహార్‌ పర్యటనలో విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలతో అభివృద్ధి అసాధ్యమని తేల్చిచెప్పారు.

ఆ పార్టీలతో అభివృద్ధి అసాధ్యం.. విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌ను అభివృద్ధి చేసే ఉద్దేశ్యం కాంగ్రెస్, ఆర్జేడీలకు ఏమాత్రం లేదని ప్రధాని మోడీ అన్నారు. ముజఫ్ఫర్‌పూర్‌లో జరిగిన భారీ ర్యాలీలో విపక్షాలపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. ఎన్డీయే ప్రభుత్వమే నిక్కచ్చిగా బిహార్ అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. అదే సమయంలో సంస్కృతీ సంప్రదాయాలకు కూడా ఎన్డీయే కూటమి విలువనిస్తుందన్నారు. కానీ విపక్షాలు మాత్రం సంప్రదాయాలను అవమానిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పవిత్రమైన ‘ఛఠ్ పూజ’ పండుగను విపక్షాలు కించపరిచాయని, బిహారీలు పవిత్రంగా చేసుకునే ఈ పండుగ వారి దృష్టిలో డ్రామాలని మోడీ అన్నారు.

తమ ప్రభుత్వం ఈ పండుగకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని చెప్పిన ఆయన.. ఈ పండుగను, ఛఠీ మాతను కించపరిచిన విపక్షాలను ఎన్ని తరాలు గడిచినా బిహారీలు క్షమించరన్నారు. బుధవారం ఇదే నియోజకవర్గంలో ప్రసంగించిన విపక్ష నేత రాహుల్ గాంధీ.. ఛఠ్ పూజ సందర్భంగా యమునా నదిలో మోడీ మునగడం అంతా పెద్ద డ్రామా అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే కూటమి నేతలు మండిపడ్డారు. ఈ పండుగ విశిష్టత రాహుల్‌కు తెలియదనే విషయం ఈ వ్యాఖ్యలతో స్పష్టం అవుతోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీని అవమానించిన రాహుల్.. ఛఠీ మాతను కూడా కించపరిచారని గుర్తుచేశారు. ‘మీ పార్టీ నేతలు పీఎం తల్లిని అవమానిస్తే.. మీరు ప్రధానితోపాటు ఛటీ మాతను కూడా కించపరిచారు. నవంబరు 14న బాక్సులు తెరిచినప్పుడు మీ మహాకూటమి తుడిచిపెట్టుకుపోతుంది’ అంటూ విమర్శించారు.

40 వేల కిడ్నాప్‌లు..

విపక్షాలు గెలిస్తే మళ్లీ బిహార్‌లో ‘జంగిల్ రాజ్’ వస్తుందని ప్రధాని మోడీ హెచ్చరించారు. నాటు తుపాకులు, క్రూరత్వం, సామాజిక అన్యాయం, అక్రమ పాలన, అవినీతి రాజ్యమేలుతాయన్నారు. ఆర్జేడీ పాలనలో బిహార్‌లో 35 వేలకుపైగా కిడ్నాప్‌లు జరిగాయని ఆయన చెప్పారు. లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూతోపాటు తేజస్వీ యాదవ్ కూడా నిందితుడేనని, ఇప్పుడు బెయిల్‌పై తిరుగుతూ నమ్మశక్యం కాని హామీలు ఇస్తున్నాని విమర్శించారు. 2001లో ఉత్తర బిహార్‌లో కలకలం రేపిన 8 ఏల్ల పిల్లాడు గోలూ హత్యోదంతాన్ని కూడా ప్రజలకు గుర్తుచేశారు.

Next Story