నక్సలిజం కనుమరుగవుతోంది.. రెడ్ కారిడార్లు గ్రోత్ జోన్లుగా మారాయి: మోడీ

by Phanindra |   (  Updated:2025-07-21 16:01:00  IST  )

దేశంలో నక్సలిజం కనుమరుగవుతోందని, గతంలో రెడ్ కారిడార్లుగా ఉన్న ప్రాంతాలు గ్రీన్ గ్రోత్ జోన్లుగా మారుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు.

నక్సలిజం కనుమరుగవుతోంది.. రెడ్ కారిడార్లు గ్రోత్ జోన్లుగా మారాయి: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో నక్సలిజం కనుమరుగవుతోందని, దీని కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన పలు అంశాలను ఉటంకిస్తూ ప్రసంగించారు. నక్సలిజం, టెర్రరిజం వంటి సవాళ్లను చాలాకాలం భారత్ భరించిందని, ఇప్పుడు ఈ సమస్యలు తీవ్రత చాలా వేగంగా తగ్గిపోతోందని అన్నారు. ‘బాంబులు, గన్నుల మోతలతో దద్దరిల్లిన ప్రాంతాల్లో రాజ్యాంగం, చట్టం పైచేయి సాధిస్తున్నాయి. ఒకప్పుడు రెడ్ కారిడార్లుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు మారిపోతున్నాయి. అభివృద్ధిలో గ్రీన్ జోన్లుగా రూపాంతరం చెందుతున్నాయి’ అని మోడీ చెప్పారు. అదే సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడాన్ని మరోసారి కొనియాడిన ఆయన.. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాదుల ప్రధాన స్థావరాలను ధ్వంసం చేశామని గుర్తుచేశారు. ఈ ఆపరేషన్‌లో కనిపించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ శక్తి మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించిందని చెప్పారు. ప్రపంచంలో తను కలిసిన వారంతా ఈ ఆయుధాలపై చాలా ఆసక్తి కనబరిచారన్నారు. వర్షాకాల సమావేశాల్లో అందరూ ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. అలా చేస్తే భారత భద్రతా దళాలకు మరింత ప్రోత్సాహం అందుతుందన్నారు.

2014లో బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్.. ఇప్పుడు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు అడుగు దూరంలో ఉందని మోడీ చెప్పారు. గత దశాబ్దంలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని, ద్రవ్యోల్బణం కూడా తగ్గి ప్రజల జీవన పరిస్థితులు నిలకడగా ఉన్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ డేటాను కూడా పునరుద్ఘాటించిన ఆయన.. దేశంలో 90 కోట్ల మందికి సోషల్ సెక్యూరిటీ ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ట్రకోమాను భారత్ నిర్మూలించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. వైద్యారోగ్య రంగంలో ఇదొక కీలకమైన మైలురాయి అని చెప్పారు.

ఇదే క్రమంలో యూపీఐ వ్యాప్తిని కూడా గుర్తుచేసిన ఆయన.. దీన్ని అంతర్జాతీయ ఫిన్‌టెక్ రంగంలో భారత నాయకత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. అంతర్జాతీయంగా యూపీఐకి గుర్తింపు లభించిందన్నారు. చివరగా దేశంలో ఎంతో రాజకీయ వైవిధ్యం ఉందన్న ఆయన.. దేశసంక్షేమం కోసం అందరూ కలిసిరావాలన్నారు. పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ దేశానికి సంబంధించిన విషయాల్లో కలిసి పనిచేయాలన్నారు. మొత్తం 32 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 21న ముగియనున్నాయి. మధ్యలో ఆగస్టు 12న రెండు సభలను వాయిదా వేస్తారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న అనంతరం.. 18వ తేదీన తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

Next Story