- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టం మనదే: మోడీ
మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్ మారిందని ప్రధాని మోడీ కొనియాడారు. ప్రజలు తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటున్నారన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. కొత్త ఏడాదిలో తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. ఉత్పత్తి దారులు ‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే ప్రజలు పరిశుభ్రతకు, అటవీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆదివారం నాడు జాతీయ ఓటర్ల దినం జరుపుకుంటున్న భారత్.. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన ప్రధాని.. ఓటర్లు ప్రజాస్వామ్యానికి ఆత్మల వంటి వారని, తొలిసారి ఓటు హక్కు సంపాదించిన యువత ఆ రోజును కూడా జన్మదినంలా జరుపుకోవాలని చెప్పారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం, 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో దేశంలో 96 కోట్లపైగా ఓటర్లున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం. వీరిలో 1.8 కోట్ల మందికిపైగా తొలిసారి ఓటు హక్కు సంపాదించిన వారే ఉన్నారని ఈసీ తెలిపింది.
స్టార్టప్‌ల జోరు..
దేశంలో స్టార్టప్‌ల జోరు పెరిగిందని ప్రధాని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయో టెక్నాలజీ వంటి ఎన్నో కీలక రంగాల్లో స్టార్టప్‌లు వచ్చాయని ఆయన చెప్పారు. దీంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ల సిస్టం మన దేశంలో తయారైందని కొనియాడారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ‘స్టార్టప్ ఇండియా’ పథకం ఎంతో విజయం సాధించిందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2025 డిసెంబరు నాటికి దేశంలో 2 లక్షల స్టార్టప్‌లకు ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. వీటిలో సగం వరకు టయర్-2, టయర్-3 పట్టణాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2014లో కేవలం నాలుగు యూనికార్న్ కంపెనీలు ఉన్న దేశంలో.. వీటి సంఖ్య 120కి చేరింది. నేటికి ఈ యూనికార్న్‌ల విలువ 350 బిలియన్ డాలర్లని అంచనా.
క్వాలిటీనే మంత్రం..
అంతర్జాతీయంగా భారత్‌కు అద్భుతమైన గుర్తింపు లభిస్తుందన్న ప్రధాని మోడీ.. ఈ సమయంలో మానుఫ్యాక్చరింగ్ సంస్థలు క్వాలిటీపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా ఎదుగుతోంది. ప్రపంచం అంతా మనల్ని గమనిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో మనందరిపైనా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. అదే క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం. మన మంత్రం కేవలం క్వాలిటీనే కావాలి. భారత ఉత్పత్తులు అనగానే అందరూ టాప్ క్వాలిటీ అనేలా చేయాలి’ అని పేర్కొన్నారు. టెక్స్‌టైల్స్ నుంచి టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్.. ఇలా ఏ రంగమైనా సరే నాణ్యతపై ఫోకస్ పెట్టాలన్నారు.
ప్రజల సామాజిక సేవ..
దేశంలో ప్రజలు చేసిన సామాజిక సేవను కూడా ప్రధాని గుర్తుచేశారు. పరిశుభ్రత, కాలుష్య నియంత్రణ, అటవీకరణపై ప్రజలు దృష్టిపెట్టారన్నారు. సుదీర్ఘ కాలంగా పట్టిపీడిస్తున్న సమస్యలకు అందరూ కలిసి పరిష్కరిస్తున్నారని చెప్పారు. యూపీలోని అజాంగఢ్‌లో ప్రజలంతా కలిసి తంసా నదిని శుభ్రం చేసి, నదీతీరంలో పండ్ల మొక్కలు నాటారు. ఏపీలోని అనంతపురంలో కరువును తొలగించేందుకు రిజర్వాయర్‌ను ప్రజలే పునరుద్ధరించారు. ఇలాంటి ఘటనలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, చెన్నయ్‌లో కూడా జరిగాయి. వీటన్నింటినీ ప్రధాని మోడీ ప్రస్తావించారు. అలాగే ఇటీవలి కాలంలో భక్తిగీతాలతో సాగే కన్సర్ట్‌లకు ఆదరణ పెరుగుతోందని, ‘భజన్ క్లబ్బింగ్’ పేరుతో ఈ ట్రెండ్ యువతలో బాగా పాపులర్ అవుతోందన్నారు.






