ప్రధాని మోడీకి బార్బడోస్ అత్యున్నత పురస్కారం

by Ajay Maddhiboyina |

2024 నవంబర్ 20న గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరిగిన 2వ ఇండియా-కరికామ్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ, బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ సమావేశం అయ్యారు.

ప్రధాని మోడీకి బార్బడోస్ అత్యున్నత పురస్కారం
X

- ‘ఆనరరీ ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రీడం ఆఫ్‌ బార్బడోస్‌’ ప్రదానం

- కొవిడ్ టైంలో చేసిన విలువైన సేవలకు గాను ఎంపిక

- మోడీ తరఫున అవార్డు అందుకున్న కేంద్ర మంత్రి పబిత్రా మార్గెరిటా

దిశ, నేషనల్ బ్యూరో: కోవిడ్-19 పాండమిక్ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మక నాయకత్వం, విలువైన సహాయానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు లభించింది. కరేబియన్ దేశమైన బార్బడోస్ ఈ మేరకు 'ఆనరరీ ఆర్డర్ ఆప్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్'అవార్డును ప్రధాని మోడీకి ప్రకటించింది. బ్రిడ్జిటౌన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ తరపున విదేశాంగ, జౌలి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా ఈ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డు రెండు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి ప్రతీక అని విదేశాంగ శాఖ తెలిపింది.

2024 నవంబర్ 20న గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరిగిన 2వ ఇండియా-కరికామ్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ, బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ సమావేశం అయ్యారు. అప్పుడే మోడీకి అమోర్ మోట్లీ ఈ అవార్డును ప్రకటించారు. కోవిడ్-19 పాండమిక్ సమయంలో మోడీ అనుసరించిన వ్యూహాత్మక నాయకత్వం, అందించిన విలువైన సహాయాన్ని గుర్తించి ఈ అవార్డును బార్బడోస్ ప్రకటించింది. పాండమిక్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆందోళన నెలకొంది. ఆ సమయంలో అంతర్జాతీయ సహకారాన్ని, మద్దతును బలోపేతం చేయడంలో మోడీ కీలక పాత్ర పోషించారని అమోర్ మోట్లీ తెలిపారు.

ఇక ప్రధాని మోడీ తరపున అవార్డు అందుకున్న మార్గెరిటా స్పందిస్తూ.. ప్రధానికి ఈ గుర్తింపు లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాతినిథ్యం వహించడం, ఆయన తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ ప్రత్యేక గుర్తింపు ఇండియా, బార్బడోస్ మధ్య లోతైన సంబంధాలను.. ముఖ్యంగా సంక్షోభ సమయంలో సహకారం, అభివృద్ధికి రెండు దేశాల ఉమ్మడి నిబద్దతను నొక్కిచెబుతుందని అన్నారు.

Next Story