Narendra Modi: ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ప్రతీక.. ప్రధాని మోడీ

by B.Srinivas |   (  Updated:2025-04-21 15:54:14  IST  )

క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

Narendra Modi: ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ప్రతీక.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (Pope Francis) (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 7:35 గంటలకు వాటికన్ సిటీలోని తన నివాసమైన కాసా శాంటా మార్టాలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిని వాటికన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్న పోప్ 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది గత నెల 14న డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి నుంచి ప్రజలకు దూరంగా ఉన్న పోప్ ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రజల ఎదుట ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోప్ అంత్యక్రియలు నాలుగు నుంచి ఆరు రోజుల తర్వాత జరగనున్నాయి.

పోప్ నేపథ్యం?

కాథలిక్ చర్చి అధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ 1938 డిసెంబర్ 17న అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జన్మించారు. 1963లో తత్వ శాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత పలు పాఠశాలల్లో బోధించారు. ఈ క్రమంలోనే 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పోప్ తన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితమై పనిచేశారు.

సంతాపం తెలిపిన ప్రపంచ నేతలు

పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల భారత ప్రధాని మోడీ సహా ప్రపంచాధి నేతలు సంతాపం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా, యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా, వాన్ డెర్ లెయన్ సహా పలువురు సంతాపం తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ మృతికి స్పెయిన, అర్జెంటీనా, బ్రెజిల్‌లు సంతాప దినాలు ప్రకటించాయి. ‘పోప్ ఫ్రాన్సిస్ మరణం నన్ను చాలా బాధపెట్టింది. ఈ విషాద సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం. కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి చిహ్నంగా పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు’ అని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Next Story