Ekta Diwas: సర్దార్ సాక్షిగా ప్రధాని మోదీ ప్రమాణం.. అబ్బుర పరిచిన విన్యాసాలు

by Y.Nagarani |   ( Updated:2024-10-31 04:51:07.0  )
Ekta Diwas: సర్దార్ సాక్షిగా ప్రధాని మోదీ ప్రమాణం.. అబ్బుర పరిచిన విన్యాసాలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఘన నివాళి అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా గుజరాత్ లోని కేవాడియాలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity) వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్దార్ సేవల్ని గుర్తు చేసుకుంటూ జాతి సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు. ఐకమత్యమే మా విధానం అని సర్దార్ వల్లభ్ భాయ్ సాక్షిగా ప్రధాని మోదీ ప్రమాణం చేశారు. అనంతరం అక్కడ నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలకు (Rashtriya Ekta Diwas) హాజరై.. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జవాన్లు చేసిన అద్భుత విన్యాసాలు అదరహో అనిపించాయి. దేశ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు.. తమ విన్యాసాలతో అబ్బురపరిచారు. 9 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు, సెంట్రల్ ఫోర్స్, ఎన్ సీసీ టీమ్ పరేడ్ మార్చ్ చేశారు. బైక్ లతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విన్యాసాలను వీక్షించిన ప్రధాని సాయుధ బలగాలకు సెల్యూట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సర్దార్ భావజాలం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కష్టపడితే ఏదీ అసాధ్యం కాదని ఆయన నిరూపించారని, దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడిన ఘనత పటేల్ కే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో దేశ సమైక్యత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఐక్యతా విగ్రహ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా రైతులు పొలాల్లో వాడే పరికరాల నుంచి లోహాన్ని సేకరించి తీసుకొచ్చామని, ఇక్కడ ఒక ఏక్తా నర్సరీనే ఉందన్నారు. ప్రపంచంలో చాలా అడవుల నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఇక్కడ ఉన్నాయన్నారు. ఏక్తామాల్ లో హస్తకళల ఉత్పత్తులను అమ్ముతున్నారని, ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ అలాంటి మాల్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ తో సామాజిక అసమానతలు పోతాయన్నారు ప్రధాని మోదీ. ఇదే నిజమైన సెక్యులర్ సివిల్ కోడ్ అని తెలిపారు. ఆర్టికల్ 360ని రద్దు చేశాం. వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు, వన్ నేషన్ - వన్ ట్యాక్స్ విధానాలను తీసుకొచ్చాం. వన్ నేషన్ - వన్ ఎలక్షన్స్ ను కూడా తీసుకొస్తామన్నారు. దీనివల్ల దేశం మరింత బలోపేతమవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed