ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని.. ఇక 2 గంటల్లోనే గమ్యస్థానం!

by Ramesh Naini |

ప్రధాని నరేంద్ర మోడీ సుమారు రూ. 11,868 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన 212 కిలోమీటర్ల ‘ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్’ (ఎక్స్‌ప్రెస్‌వే)ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని.. ఇక 2 గంటల్లోనే గమ్యస్థానం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ సుమారు రూ. 11,868 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన 212 కిలోమీటర్ల ‘ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్’ (ఎక్స్‌ప్రెస్‌వే)ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సరికొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రావడంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం 6 గంటల నుంచి కేవలం 2 గంటలకు తగ్గనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు, ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా.. స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, చార్ ధామ్ యాత్ర తదితర పర్యాటక రంగాలకు మహర్దశ పడుతుందని ఆయన వివరించారు.

12 కిలోమీటర్ల మేర ప్రత్యేక కారిడార్

పర్యావరణానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత పాటిస్తూ.. ఏనుగులు, ఇతర వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 12 కిలోమీటర్ల మేర ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్ నిర్మించినట్లు మోడీ వెల్లడించారు. పవిత్రమైన దేవభూమిని ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని యాత్రికులకు సూచించారు. కాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన మోడీ.. మహిళా రిజర్వేషన్ల అమలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) ద్వారా మాజీ సైనికుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ వేదికగా పునరుద్ఘాటించారు. దేశంలో గత పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని, కేవలం ఉత్తరాఖండ్‌లోనే ప్రస్తుతం రూ.2.25 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయని ప్రధాని స్పష్టం చేశారు.

Next Story