కేంద్ర కార్యదర్శులతో ప్రధాని మోడీ హై-లెవెల్ మీటింగ్

by Malleboina Mahesh |

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో నేడు ప్రధాని మోదీ హై-లెవెల్ మీటింగ్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 'వికసిత్ భారత్' సంస్కరణలపైనే ముఖ్య అజెండా!

కేంద్ర కార్యదర్శులతో ప్రధాని మోడీ హై-లెవెల్ మీటింగ్
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర కార్యదర్శులతో హై-లెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలో ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. సీషెల్స్ అధికారిక పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధాని, దేశ బ్యూరోక్రసీతో నిర్వహిస్తున్న రెండవ అతిపెద్ద సమగ్ర సమీక్ష ఇదే కావడం గమనార్హం. ఈ హై-లెవెల్ మీటింగ్‌లో ప్రధానంగా దేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని (Ease of Doing Business) మరింత మెరుగుపరచడం, ప్రజల జీవన ప్రమాణాలను సులభతరం చేయడం (Ease of Living), 'వికసిత్ భారత్ - 2047' దిశగా పరిపాలనా సంస్కరణలను వేగవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ కీలక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “52 వారాల్లో 52 సంస్కరణలు” (52 Reforms in 52 Weeks) కార్యక్రమ పురోగతిని ప్రధాని మోదీ శాఖల వారీగా సమీక్షించనున్నారు. ఇందులో భాగంగా పాల్గొనే ప్రతి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి తమ తమ విభాగాల్లో రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించడానికి తీసుకున్న చర్యలు, ప్రతిపాదనలపై ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కేవలం 3 నిమిషాల సమయం కేటాయించారు. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ టూల్స్ వినియోగాన్ని పెంచడం మరియు ప్రజలకు చేరే పథకాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చూడటంపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీలు పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్ మరియు కేబినెట్ సెక్రటరీ టి.వి. సోమనాథన్ తదితరులు పాల్గొననున్నారు.

Next Story