- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగలా జరుపుకోండి.. ‘పరీక్షా పే చర్చ’లో విద్యార్థులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం
‘పరీక్షలు అంటే భయం కాదు.. అవి మనల్ని మనం పరీక్షించుకునే పండుగలు. ఒత్తిడిని దరిచేరనీయకుండా, నేర్చుకోవడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలి’ అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘పరీక్షలు అంటే భయం కాదు.. అవి మనల్ని మనం పరీక్షించుకునే పండుగలు. ఒత్తిడిని దరిచేరనీయకుండా, నేర్చుకోవడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలి’ అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన ‘పరీక్షా పే చర్చ’ (PPC) 9వ ఎడిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులతో ఆయన ముఖాముఖిగా గడిపారు. అత్యంత ఆత్మీయంగా జరిగిన ఈ సంభాషణలో విద్యార్థుల సందేహాలకు ప్రధాని తనదైన శైలిలో సమాధానాలిస్తూ పలు ‘సక్సెస్ మంత్రాల’ను పంచుకున్నారు.
మీ శైలి.. మీ వేగం..
చదువుకునే విధానంపై విద్యార్థులు గందరగోళానికి గురి కావద్దని ప్రధాని సూచించారు. ‘ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అందరి సలహాలు వినండి, కానీ మీకు నచ్చిన, మీకు అలవాటైన పద్ధతిలోనే చదువును కొనసాగించండి. ఇతరులను చూసి మీ పద్ధతిని మార్చుకోవద్దు’ అని ఆయన స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులకు ప్రధాని సూచనలు..
బోధనలో ఉపాధ్యాయుల పాత్రను ప్రస్తావిస్తూ.. ‘రైతు పొలాన్ని దున్నినట్లుగా, ఉపాధ్యాయులు మొదట విద్యార్థుల మనసులను సిద్ధం చేయాలి (Plough the mind). పాఠ్యాంశాలను బోధించే ముందే వాటిపై విద్యార్థుల్లో కుతూహలం కలిగించాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల కంటే ఒక్క అడుగు ముందుంటే చాలు, విద్యార్థులు తమంతట తామే నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు’ అని వివరించారు.
సాంకేతికత - ఏఐ (AI) వాడకం
కేవలం మార్కుల కోసం పాకులాడటం కంటే నైపుణ్యాల (Skills) సాధనపై దృష్టి పెట్టాలని ప్రధాని హితవు పలికారు. నేటి యుగంలో ఏఐ వంటి సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అయితే దాన్ని తెలివిగా వాడుకోవాలని మోడీ సూచించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా (Viksit Bharat) మార్చడమే తన లక్ష్యమని, ఆ సమయంలో నేటి యువతే కీలక పాత్ర పోషిస్తారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాడిన దేశభక్తి గీతాలను, వారి సృజనాత్మకతను ప్రధాని ప్రశంసించారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్ తదుపరి భాగం ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రసారం కానుందని అధికార వర్గాలు తెలిపాయి.






