- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: మానవాళి ఎదుట ఉన్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదం
మానవాళి ఎదుట ఉన్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదం అని ప్రధాని మోడీ అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: మానవాళి ఎదుట ఉన్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదం అని ప్రధాని మోడీ అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) భేటీ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడే మోడీ పహెల్గాం ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు. ‘‘ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు. పహెల్గాం దాడి తర్వాత సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతుగా నిలిచింది. అందుకు ఆ దేశానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోడీ నొక్కి చెప్పారు.
అంగోలాకు 200 మిలియన్ డాలర్ల రక్షణ రుణం
అంతేకాకుండా, అంగోలా అధ్యక్షుడు లారెన్సోతో ప్రధాని మోడీ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాల రంగాలతో సహా మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం గురించి చర్చలు జరిపారు. అంగోలాకు 200 మిలియన్ డాలర్ల రక్షణ రుణాన్ని ప్రకటించారు. లారెన్సో భారత పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా భారతదేశం-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని కూడా బలోపేతం చేస్తుందని మోడీ అన్నారు. "అంగోలా రక్షణ దళాల ఆధునికీకరణకు మద్దతు ఇవ్వడానికి భారత్ 200 మిలియన్ డాలర్ల రక్షణ రుణాన్ని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను" అని ఆయన అన్నారు. రక్షణ రంగం బలోపేతం, సమగ్ర పరిశీలన, సరఫరాపై కూడ చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు, స్పేస్ టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్ వంటి రంగాల్లో భారతదేశం అంగోలాతో కలిసి పనిచేస్తుందని మోడీ అన్నారు. "ఆరోగ్య సంరక్షణ, వజ్రాల ప్రాసెసింగ్, ఎరువులు, కీలకమైన ఖనిజాల రంగాల్లో మా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కూడా మేం నిర్ణయించుకున్నాము." అని అన్నారు. భారత్- ఆఫ్రికన్ యూనియన్ మధ్య సంబంధాల్లో పురోగతి జరిగిందన్నారు. గ్లోబల్ సౌత్ కు ఇరు దేశాలు మూలస్థంభాలని అన్నారు. కాగా.. డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాల రంగాలతో సహా మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన మోడీకి అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సో ధన్యవాదాలు తెలిపారు.






