- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొదుపు పాటించాలని ప్రధాని పిలుపు.. సైకిల్‌పై హైకోర్టుకు న్యాయమూర్తి
ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు స్పందించి మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకాధీశ్ బన్సల్ మంగళవారం సైకిల్‌పై కోర్టుకు వచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు స్పందించి మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకాధీశ్ బన్సల్ మంగళవారం సైకిల్‌పై కోర్టుకు వచ్చారు. జబల్‌పూర్ బెంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, సివిల్ లైన్స్ ప్రాంతంలోని తన అధికారిక నివాసం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బన్సల్ మాట్లాడుతూ.. ఇంధన పొదుపుపై సామాన్యులకు ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘హైకోర్టు న్యాయమూర్తులమైనంత మాత్రాన మేమేమీ ప్రత్యేకం కాదు. సామాజిక బాధ్యతల్లో అందరూ భాగస్వామ్యం కావాలి. తక్కువ దూరాలకు ప్రయాణించేటప్పుడు సైకిల్ వాడటం ఉత్తమం’ అని సూచించారు. అలాగే చీఫ్ జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాతో కలిసి తాను తరచుగా సైక్లింగ్ చేస్తుంటానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి..
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల (పశ్చిమాసియా సంక్షోభం) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న దృష్ట్యా.. ప్రజలు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ఇటీవల హైదరాబాద్, వడోదరలలో జరిగిన సభల్లో ప్రధాని మోడీ కోరారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని, వీలైనంత వరకు ప్రజా రవాణాను, సైకిళ్లను లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ఆయన సూచించిన విషయం తెలిసిందే.






