Faridabad: ఒకవైపు తీవ్ర నేరం.. మరోవైపు తీరని ఆందోళన.. ఉగ్రకేసులో భిన్నకోణం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-23 13:46:20  IST  )

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో భిన్న కోణం బయటికొచ్చింది.

Faridabad: ఒకవైపు తీవ్ర నేరం.. మరోవైపు తీరని ఆందోళన.. ఉగ్రకేసులో భిన్నకోణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో భిన్న కోణం బయటికొచ్చింది. ఒక పక్క ఉగ్ర నెట్ వర్క్ ఇంకా ఎక్కడెక్కడ ఉందో చేధించే పనిలో పోలీసులు ఉంటే.. ఫరీదాబాద్ ఇంటి యజమాని ఉగ్రవాదుల నుంచి తన అద్దె తనకు ఇప్పించాలని పోలీసులను పదే పదే కోరడం గమనార్హం. దీంతో ఆయనకు కేసు తీవ్రత అర్థం కావడం లేదంటున్నారు పోలీసులు. సీరియస్ గా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. డాక్టర్ ముజమ్మిల్ కు ఇంటిని అద్దెకు ఇచ్చిన వ్యక్తి మాత్రం తన ఆరు నెలల ఇంటి అద్దెను తనకు ఇప్పించాలని కోరుతున్నాడు.

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ లో కీలక వ్యక్తి అయిన డాక్టర్ ముజమ్మిల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిని విచారించడంతో ఇంటి యజమాని ఇష్తియాక్ పేరు బయటికొచ్చింది. ఈ క్రమంలో ఆ ఇంటి నుంచి పెద్దఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హర్యానాలోని మేవాత్ కు చెందిన ఇంటి యజమాని ఇష్తియాక్ ను కూడా అరెస్ట్ చేసి విచారణ చేయగా.. ఈ ఏడాది ప్రారంభంలో ముజమ్మిల్, ఉమర్ లు తన వద్దకు వచ్చిన ఎరువులు నిల్వ చేసేందుకు ఇల్లు కావాలని అడిగారన్నాడు. నెలకు రూ.2500 ఇస్తామని చెప్పడంతో అద్దెకిచ్చినట్లు తెలిపాడు.

6 నెలలుగా వాళ్లు అద్దె ఇవ్వలేదని, వారి నుంచి తనకు రావలసిన అద్దె డబ్బు ఇప్పిస్తే పేదరికంలో ఉన్న తన కుటుంబానికి పంపుతానని మొరపెట్టుకుంటున్నాడని తెలుస్తోంది. తనకు నలుగురు పిల్లలు అని, వారిని పోషించేందుకు ఇదే ఆధారమని వాపోతున్నాడట. కేసు తీవ్రత ఎంత ఉన్నా.. ఇష్తియాక్ కు తన కుటుంబ పోషణ, అందుకు కావలసిన అద్దె డబ్బే ముఖ్యంగా కనిపించడం కాస్త భిన్నంగా ఉంది. కాగా..ఇష్తియాక్ ను మరింత విచారణ నిమిత్తం జమ్ముకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ సంస్థకు అప్పగించారు.

Next Story