రీల్‌ కోసం ప్రాణాలతో ఆట.. ఏడేళ్ల కూతురిని ప్రమాదంలో నెట్టిన తల్లిదండ్రులు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-08 16:12:49  IST  )

ప్రస్తుతం సోషల్ మీడియా మన జీవితంలో భాగంగా మారిపోయింది.

రీల్‌ కోసం ప్రాణాలతో ఆట.. ఏడేళ్ల కూతురిని ప్రమాదంలో నెట్టిన తల్లిదండ్రులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) మన జీవితంలో భాగంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అవుతున్నారు. ఈ క్రమంలో నెట్టింట ఎలాగైనా ఫేమస్ అవ్వాలని చాలామంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఫాలోవర్లు, లైక్స్‌, కామెంట్ల కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూశాం. అయినా ఇప్పటికీ ఈ మత్తు తగ్గడం లేదు. తాజాగా రాజస్థాన్‌లో ఓ తల్లిదండ్రులు రీల్‌ (Reels) కోసం త‌మ ఏడేళ్ల కుమార్తెను ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.

రాజస్థాన్‌ (Rajastan) రాష్ట్రం భరత్‌పూర్‌లోని బరేథా జలాశయం వద్దకు ఓ జంట తమ ఏడేళ్ల కుమార్తెను తీసుకుని వెళ్లారు. అక్కడ రీల్స్‌ కోసం తమ కుమార్తెను జలాశయం గోడను ఆనుకొని ఉన్న ఇనుపకడ్డీలపై అమర్చిన విద్యుత్‌ పెట్టెపై కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్లడానికి చిన్నారి భయపడుతున్నప్పటికీ తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహిస్తూ.. ఇనుపకడ్డీలపై ఉన్న విద్యుత్‌ పెట్టెపై కూర్చోబెట్టారు. అనంతరం ఫోన్‌ వైపు చూడాలని చిన్నారికి ఆమె తండ్రి సూచించడంతో చిన్నారి భయపడుతూ అలాగే కూర్చొని ఉంది. ఏమాత్రం పట్టు తప్పినా.. బాలిక జలాశయంలో పడిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలకు చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎలా అని కామెంట్లలో మండిపడ్డారు.

Next Story