చావుతో ఆట..! మన్మాడ్ స్టేషన్‌లో హైడ్రామా.. 25 వేల వోల్ట్ స్తంభంపై యువకుడు వైరల్

by Ramesh Naini |

మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) సాయంత్రం తీవ్ర కలకలం రేగింది.

చావుతో ఆట..! మన్మాడ్ స్టేషన్‌లో హైడ్రామా.. 25 వేల వోల్ట్ స్తంభంపై యువకుడు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. ఒక యువకుడు ప్లాట్‌ఫాం నంబర్ 4 వద్ద ఉన్న 25 వేల వోల్టుల సామర్థ్యం గల హైటెన్షన్ ఓవర్‌హెడ్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. అతన్ని కిందకు దించే ప్రయత్నంలో సుమారు గంటన్నర పాటు సాగిన ఈ హైడ్రామా ఎట్టకేలకు సుఖాంతం కావడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫాం నంబర్ 4, 5ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడు స్తంభం ఎక్కడాన్ని గమనించిన ప్రయాణికులు, రైల్వే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతడు హైటెన్షన్ వైర్లకు అతి సమీపంలో ఉండటంతో, ప్రాణాపాయం జరగకుండా అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కిందకు దూకేస్తానని అతడు బెదిరింపులకు దిగడంతో రైల్వే పోలీసులు (GRP), ఆర్పీఎఫ్ (RPF), రైల్వే సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు.

ఉత్కంఠగా సాగిన రెస్క్యూ ఆపరేషన్

విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత, ఇద్దరు రైల్వే సిబ్బంది స్తంభం పైకి ఎక్కి అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సిబ్బంది పైకి రావడం చూసి అతడు కిందకి దూకేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని ఆపి కొంత మంది సిబ్బంది కొట్టే ప్రయత్నం చేశారు. అతడు మాట వినే స్థితిలో లేకపోవడంతో అప్రమత్తమైన సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్లాట్‌ఫాంపై ఉన్న వెండర్ల సహాయంతో అన్ని వైపుల నుంచి సిబ్బంది చుట్టుముట్టి, తాడు సాయంతో అతడిని సురక్షితంగా కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.

నిలిచిన రైళ్ల రాకపోకలు..

ఈ ఘటన కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై వైపు వెళ్లే ఒక రైలు, ముంబై నుంచి వస్తున్న రెండు రైళ్లు.. మొత్తం మూడు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు అకారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా, సదరు యువకుడు మానసిక స్థిమితం లేని వ్యక్తిగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడు ఎక్కడి నుంచి వచ్చాడు, కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట విద్యుత్ స్తంభం ఎలా ఎక్కాడు అనే కోణంలో రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.

Next Story