బీహార్ ఉపఎన్నికలో పీకే పోటీ? తమిళనాడు జోష్‌తో సరికొత్త వ్యూహం!

by Prasad Jukanti |

బీహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జన సూరాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

బీహార్ ఉపఎన్నికలో పీకే పోటీ? తమిళనాడు జోష్‌తో సరికొత్త వ్యూహం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయాల్లో మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీకి దూరమైన ఆయన ఇక ప్రజాక్షేత్రంలో పోటీ చేసేందుకు రెడీ అయ్యారా? తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే సమాధానమే వస్తోంది. త్వరలో బిహార్‍లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే బైపోల్‍లో పీకే పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఈ స్థానం నుంచి ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజాగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందనే టాక్ వినిపిస్తోంది.

బీజేపీన ఓడించేది జన్ సురాజ్ మాత్రమే:

తాజాగా పాట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ బాంకీపూర్ బైపోల్‍లో పోటీ చేయడానికి తమ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించుకుందని తెలిపారు. ఇక్కడ బీజేపీని ఓడించే సత్తా కేవలం జన్ సురాజ్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఇక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు గ తంలో భారీ ఓట్ల తేడాదో ఓడిపోయాయని, ఇక్కడ మేము బలమైన అభ్యర్థిని నిలబెడితే కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ బైపోల్ లో మీరే స్వయంగా పోటీ చేస్తారా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆ నిర్ణయం పార్టీ నాయకత్వం తీసుకుంటుందన్నారు. గత ఎన్నికల్లో పార్టీ సంస్థాగత బలోపేతం కోసం నేను పోటీ చేయలేదని అయితే ఈసారి పార్టీ తీసుకునే ఉమ్మడి నిర్ణయానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానన్నారు.

గత ఎన్నికల్లో 3 శాతం ఓట్లు:

గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. రాజకీయ వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకురాగలిగిన ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీ నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేకపోవడం ఆయన పొలిటికల్ ఫ్యూచర్‍పై తీవ్ర చర్చ జరిగేలా చేసింది. అయితే ఎమ్మెల్యేలు గెలవనప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 3.4 శాతం ఓట్ షేర్ సాధించడం అందరినీ ఆకర్షించింది. ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న బాంకీపూర్ స్థానంలో గత ఎన్నికల్లో నితిన్ నబిన్ 50 వేలకు పైగా మెజారిటీతో గెలవగా జన సూరాజ్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

తమిళనాడు గెలుపు ఉత్సాహంలో పీకే:

అయితే ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేశారు. విజయ్‍ను అధికారంలోకి తీసుకువస్తానని ముందస్తుగా ప్రకటించి, చెప్పినట్లే ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని విజయ్ ప్రజాక్షేత్రంలో అందరినీ ఆకట్టుకునేలా తీసుకున్న నిర్ణయాల వెనుక పీకే ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో టీవీకేను గెలిపించిన ఉత్సాహంలో బిహార్ బైపోల్ బరిలోకి తిగితే తనకు కలిసి వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ సంగతి పక్కన పెడితే ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్‍పై గుర్రుగా ఉన్న మిగతా పార్టీలు సైతం తనకు సహకారం అందిస్తే గెలుపు మరింత సులువు అవుతుందనే లెక్కలతో కూడా పీకే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ అంచనాలన్నింటి నేపథ్యంలో బిహార్ ఉప ఎన్నికను తాను చట్టసభల్లో అడుగుపెట్టేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి జరుగుతున్న ప్రచారం ప్రకారం పీకే నిజంగానే పోటీ చేస్తారా లేదా గత ఎన్నికల మాదిరిగా చివరి నిమిషంలో నో అని చెప్పి అందరిని నిరాశ పరుస్తారా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.

Next Story