సగం ఎగుమతులపై జీరో టారిఫ్.. అమల్లోకి యూఎస్-భారత్ ట్రేడ్ డీల్

by Phanindra |

సగం భారతీయ ఎగుమతులపై జీరో టారిఫ్ వేసేలా యూఎస్ ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చింది.

సగం ఎగుమతులపై జీరో టారిఫ్.. అమల్లోకి యూఎస్-భారత్ ట్రేడ్ డీల్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై అమెరికా సుంకాలు శనివారంతో 18 శాతానికి చేరుకున్నాయి. అంతకుముందు 50 శాతం ఉన్న ఈ సుంకాలను శనివారం రాత్రి నుంచి 18 శాతానికి తగ్గించినట్లు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అసలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ముందు మధ్యంతర డీల్‌ కోసం ఫ్రేమ్‌వర్క్ కుదిరిందని, దీనిలో భాగంగానే సుంకాలు తగ్గాయని ఆయన తెలిపారు. భారతీయ ఎగుమతులు, ఉద్యోగాలు, మార్కెట్ యాక్సెస్ పెరిగేలా యూఎస్‌తో ట్రేడ్ డీల్ జరగనుందని, మార్చి నెలలో వీటిపై సంతకాలుంటాయని ఆయన చెప్పారు. ఈ డీల్‌తో యూఎస్‌కు భారత్ ఎగుమతి చేసే 86.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్లో సగానికిపైగా, అంటే 44 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పూర్తిగా రద్దవుతాయని గోయల్ తెలియజేశారు. మిగతా ఉత్పత్తులపై కూడా కాంపిటీటర్లతో పోలిస్తే తక్కువ సుంకాలు ఉండేలా డీల్ చేసుకున్నామన్నారు. సుమారు 30 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 18 శాతం మాత్రమే సుంకాలు పడతాయని, మిగతా 12 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అమెరికాలో సెక్షన్ 232 కింద సుంకాలు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సెక్షన్ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నామన్నారు.

30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్..

ఈ ఒప్పందంతో భారతీయ వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లుంతుందనే వాదనలను గోయల్ కొట్టిపారేశారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి దిగుమతి బెనిఫిట్స్ ఉండవని, అది కూడా కొన్ని రకాల అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే భారతీయ మార్కెట్లను ఓపెన్ చేశామని చెప్పారు. రెడ్ సోర్గమ్, ట్రీనట్స్, వైన్స్, స్పిరిట్స్ వంటి వాటికే సెలెక్టివ్‌గా మార్కెట్లు ఓపెన్ చేశామన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్లను పూర్తిగా తెరవాలన్న యూఎస్ డిమాండ్‌కు భారత్ అంగీకరించలేదని వివరించారు. వచ్చే ఐదేళ్లలో యూఎస్‌ నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందన్నారు. అదే సమయంలో భారత్ నుంచి యూఎస్ వెళ్లే టీ, కాఫీ, అరటికాయలు, మామిడిపండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా తొలగించేలా చేశామన్నారు. ‘భారత స్వయం సమృద్ధికి సంబంధించిన అన్ని ఉత్పత్తులను ఈ డీల్‌కు దూరంగా ఉంచాం. దీంతో భారతీయ ఎగుమతి దారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ద్వారాలు తెరుచుకున్నట్లే’ అని గోయల్ తెలిపారు.

ఇది భారత్‌కు సువర్ణాధ్యాయం..

భారత్ నుంచి వెళ్లే చాలా వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు తొలగిపోతాయన్న ఆయన.. ఈ విజయం సాధించిన రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సినదన్నారు. టీ, కాఫీ, కొబ్బరి నూనె, మసాలా దినుసులు, అరటికాయలు, మామిడి, జామ, అవొకాడో, కివి, బొప్పాయి, పైనాపిల్, మష్రూమ్స్, సెరియల్స్, బార్లీ, బేకరీ ఉత్పత్తులు, కొకొవా ఉత్పత్తులు, సెసెమీ సీడ్స్ వంటి ఎన్నో పండ్లు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు ఎత్తివేసిందన్నారు. ఈ ఒప్పందంతో భారతీయ రైతులు, ఎంఎస్ఎంఈలు, చేతివృత్తులు, హ్యాండ్లూమ్స్ రంగాలకు ఏ రకంగానూ నష్టం చేయదని గోయల్ స్పష్టంచేశారు. అలాగే అమెరికాకు భారత్ నుంచి ఎగుమతయ్యే సుమారు 13 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులపై కూడా సుంకాలు రద్దయ్యయాని తెలిపారు. అలాగే జెమ్స్, వజ్రాలపై కూడా సుంకాలు ఉండవన్నారు. భారత్ నుంచి ఎగుమతయ్యే స్మార్ట్ ఫోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ పార్టులు, ప్రాథమిక ఆటో విడిభాగాలు, గడియారాలు, వాచ్‌లు, ఎసెన్షియల్ ఆయిల్స్, హోండెకార్ సామగ్రిపై కూడా సుంకాలు తగ్గిపోతాయన్నారు.

కాంపిటీటర్లతో పోలిస్తే..

అంతర్జాతీయ సప్లయ్ చైన్లలో ఈ డీల్ భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని గోయల్ ధీమా వ్యక్తంచేశారు. చైనా, ఇండోనేషియా వంటి కాంపిటీటర్లతో పోలిస్తే.. భారత్ చేసుకున్న డీల్ చాలా మెరుగైందన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై వేసిన 25 శాతం సుంకాలను యూఎస్ పూర్తిగా కొట్టిపారేసింది. ప్రస్తుతం చైనాపై 35 శాతం, వియత్నాం, బంగ్లాదేశ్‌పై 20 శాతం, ఇండోనేషియాపై 19 శాతం అమెరికా సుంకాలు వేస్తుండగా.. భారత్‌పై వీటన్నింటికన్నా తక్కువ సుంకాలు పడుతున్నాయని, దీంతో యూఎస్ మార్కెట్లో భారత్ మెరుగైన స్థానంలో ఉంటుందని గోయల్ వివరించారు.

Next Story